దేశంలో 20 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

దేశవ్యాప్తంగా గురువారం నాటికి ఇరవై లక్షల కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్ష్‌ వర్ధన్‌ ప్రకటించారు.

Updated : 15 May 2020 18:34 IST

 

దిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం నాటికి 20 లక్షలకుపైగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష‌వర్ధన్‌ ప్రకటించారు. అంతేకాకుండా గత 45 రోజుల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని... గత 12 రోజుల్లోనే రెట్టింపు అయినట్టు ఆయన తెలిపారు. ‘‘మే నెలాఖరు నాటికి ఇరవై లక్షల కరోనా వైరస్‌ పరీక్షలు పూర్తచేయటమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే రెండు వారాలకు ముందే  మా లక్ష్యాన్ని చేరుకున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 504 ప్రయోగశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 359 ప్రభుత్వానివి కాగా, 145 ప్రైవేటు ప్రయోగశాలలు. అంతే కాకుండా రోజుకు లక్ష కొవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగల సామర్ధ్యాన్ని కూడా మనం పెంపొందించుకున్నాం.’’ అని మంత్రి తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం... 

దేశంలో ప్రతి పదిలక్షల మందిలో 1540 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అమెరికా (31,080), స్పెయిన్‌ (52,781), రష్యా (42,403), బ్రిటన్‌ (32,691), ఇటలీ (45,246) వంటి దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. 
కొవిడ్‌ కేసులు రెట్టింపు అయ్యే రేటు రెండువారాల క్రితం 11.1 రోజులుగా ఉండగా... ప్రస్తుతం అది పెరిగి 13.9 రోజులకు చేరింది. 
బుధవారం నాటికి కరోనా మరణాల రేటు 3.2 శాతంగా ఉండగా.. నయమైన రేటు 33.6 శాతంగా ఉంది. 
యాక్టివ్‌ కేసుల్లో 3 శాతం మంది ఐసీయూల్లో చికిత్స పొందుతుండగా.. 0.39శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారు. 
భారత్‌లో డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన ఆర్‌టీ-పీసీఆర్ విధానం ద్వారా కొవిడ్‌ను నిర్ధారిస్తున్నారు.
ప్రస్తుత కరోనా కేసుల పెరుగుదల రేటుకు అనుగుణంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వనరులు మనవద్ద ఉన్నాయని ప్రధాని ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ సహాధ్యక్షుడు సీకే మిశ్రా తెలిపారు. 
సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో రోజుకు రెండులక్షలకు పైగా పరీక్షా కిట్లను తయారుచేయగల సామర్ధ్యాన్ని సాధించామని మైలాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ ఎండీ హస్‌ముఖ్‌ రావల్‌ తెలిపారు. కాగా దేశంలో పరీక్షా కిట్ల తయారీకి అనునమతులు పొందిన తొలి సంస్థ మైలాబ్‌ అనే సంగతి తెలిసిందే. 
ఇక రోజుకు 1200 కరోనా నమూనాలను పరీక్షించగల అత్యధిక సామర్ధ్యమున్న కోబాస్‌-6800 టెస్టింగ్‌ ప్లాట్‌ఫాం దిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సంస్థ ఆధీనంలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని