కరోనాపై పోరులో బ్రెజిల్‌కు మరో‌ ఎదురుదెబ్బ..

కరోనా వైరస్‌తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న బ్రెజిల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో నిర్ణయాలను వ్యతిరేకించి...

Published : 16 May 2020 23:40 IST

బ్రసీలియా: కరోనా వైరస్‌తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న బ్రెజిల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో నిర్ణయాలను వ్యతిరేకించి గతనెల 16న ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్‌ హెన్రిక్‌ మాండెట్టా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన నెల్సన్ టీచ్ కూడా శుక్రవారం రాజీనామా చేయడం గమనార్హం. ఇలా ఒకే నెలలో ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేయడం బ్రెజిల్‌లో నెలకొన్న తీవ్ర పరిస్థితులకు అద్దంపడుతోంది. కరోనాపై పోరులో అధ్యక్షుడి విధానాలే ఈ రాజీనామాలకు కారణాలని నిపుణులు భావిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అధ్యక్షుడు పలు ఆంక్షలను సడలించారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లు, పలు దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. వైరస్‌ పెరుగుతున్న వేళ బోల్సోనారో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో టీచ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా, ఆయన నిర్ణయాలను సమర్థించలేక టీచ్‌ రాజీనామా చేసినట్లు సమాచారం. ఏదేమైనా ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో అక్కడ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వగా, శుక్రవారం నాటికి 2 లక్షలు దాటాయి. దీంతో అత్యధిక కేసుల జాబితాలో జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలను బ్రెజిల్‌ దాటేసింది. అమెరికా తర్వాత ఒక్కరోజులో అధిక మొత్తంలో కేసులు నమోదవుతున్న దేశంగా అది నిలిచింది. మరోవైపు టీచ్‌ రాజీనామాకు సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, అధ్యక్షుడు బోల్సోనారోకు సంబంధించిన ఓ ముఖ్య అధికారి ఈ విషయంపై స్పందించారు. టీచ్‌ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని, ఆ విషయాన్ని అధ్యక్షుడితోనూ చర్చించారని చెప్పారు. ఇప్పుడున్న తాత్కాలిక ఆరోగ్య మంత్రి ఎడ్వర్డో పజెల్లో పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాలని కేబినెట్‌లోని సభ్యులు కోరారు. 

ఆందోళన కలిగిస్తున్న కేసులు..
మరోవైపు దేశంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. గత మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. నిన్న ఒక్కరోజే 14 వేల కేసులు పెరగ్గా తాజాగా మరో 15 వేల కేసులు నమోదయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇటలీ(2,24,000)ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బ్రెజిల్‌లో 2,18,000 కేసులు  నమోదయ్యాయి. ఒక్కసారిగా వేల కేసులు పెరగడంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. రోజుకు సుమారు 800 మంది మరణిస్తున్నారు. దీంతో శ్మశానాల్లో సామూహిక ఖననాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని