చైనాలో తెరుచుకున్న మరిన్ని పాఠశాలలు

ప్రపంచానికి కరోనా వైరస్‌ను పరిచయం చేసిన చైనా ఆ మహమ్మారిని అదుపులో ఉంచుతోంది. దీంతో అక్కడ అనేక నగరాల్లో పాఠశాలలు, విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి...

Updated : 17 May 2020 10:39 IST

ఆదివారం 5 కొత్త కేసులు..

షాంఘై: ప్రపంచానికి కరోనా వైరస్‌ను పరిచయం చేసిన చైనాలో ఆ మహమ్మారి అదుపులోకి వస్తుండటంతో అక్కడ అనేక నగరాల్లో పాఠశాలలు, ఇతర సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా  మరిన్ని పాఠశాలలు తెరవగా.. విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఆదివారం 5 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురిలో ఇద్దరు విదేశాల నుంచి రాగా, మరో ముగ్గురు జిలిన్‌ ప్రావిన్స్‌కు చెందిన వారని చెప్పారు. ఈ ముగ్గురికీ వైరస్‌ ఎలా సొంకిందనే విషయం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గడంతో ఇప్పటికే బీజింగ్‌తో పాటు ఇతర నగరాల్లో పాఠశాలలను తెరిచారు.  షాంఘైలో కూడా మధ్య, ఉన్నత స్థాయి పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. పరీక్షల కోసం వీటిని తెరవగా.. విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు వింటారా? లేక తరగతులకు హాజరవుతురా? అనే విషయాన్ని వారికే వదిలేశారు. 

మరోవైపు గతనెల రోజులుగా చైనాలో కరోనా‌తో ఒక్క మరణమే సంభవించింది. జిలిన్‌ ప్రావిన్స్‌లో ఒకరు మరణించడంతో  మొత్తం మహమ్మారి మృతుల సంఖ్య 4634కి చేరింది. కేసుల సంఖ్య 82,947గా నమోదైంది. ప్రస్తుతం 86 మంది చికిత్స పొందుతుండగా, మరో 519 మంది అనుమానిత లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక వుహాన్‌లో తాజాగా 17 కొత్త కేసులు నమోదవగా.. వీరిలో 12 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. ఇక ఫిబ్రవరి 1 తర్వాత 60 శాతం విమానాలు అందుబాటులోకి వచ్చాయని చైనా పౌర విమానయాన సంస్థ పేర్కొంది. అనేక పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకున్నాయి. బీజింగ్‌లోని ఫర్బిడెన్ సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్‌, షాంఘైలోని డిస్నీల్యాండ్ సైతం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, అక్కడ సామాజిక దూరం లాంటి కచ్చితమైన చర్యలు అమల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని