అమెరికాలో 15 లక్షలు దాటిన కరోనా కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. అలాగే మరణాల సంఖ్య 90 వేలకుపైగా నమోదైంది...

Published : 17 May 2020 12:06 IST

ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఒబామా కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 90 వేలకుపైగా నమోదైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 47 లక్షలు దాటింది. వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నా అమెరికాలో ఆంక్షల సడలింపులకే అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మొగ్గుచూపుతుండడం గమనార్హం. అమెరికా తర్వాత స్పెయిన్‌, రష్యా, ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌ వరుసగా అత్యధిక కేసులు నమోదైన దేశాలుగా కొనసాగుతున్నాయి. 

ట్రంప్‌పై ఒబామా కీలక వ్యాఖ్యలు..

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో చాలా మంది తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు కూడా నటించరని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ఓ యూనివర్శిటీ‌ గ్రాడ్యుయేషన్‌ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఆన్‌లైన్‌ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని పరోక్షంగా విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ అమెరికాలో నల్లజాతీయులపట్ల వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఏళ్లుగా ఇక్కడ వారు వివక్షకు గురౌతూనే ఉన్నారన్నారు. ఎవరైనా బయటకు వెళితే హత్యలకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మహమ్మారితో అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. 

అలాగే కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను సర్వ నాశనం చేసిందని, అంతా తలకిందులైందని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు.. కనీసం తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు కూడా నటించడంలేదని ట్రంప్‌ను ఉద్దేశించి విమర్శించారు. కాగా, 2017లో అధ్యక్షుడిగా దిగిపోయాక ఒబామా సాధరణ జీవితానికి అలవాటు పడ్డారు. చాలా అరుదుగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఇటీవల సైతం ఒబామా.. ట్రంప్‌ను విమర్శించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని