కొవిడ్‌ 19: మీ హృదయం పదిలం కాదు!

తీవ్రమైన గుండె, రక్తనాళాల వ్యాధులకు కొవిడ్‌-19 కారణమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుండె వైఫల్యం, గుండెపోటు, రక్తం గడ్డకట్టేందుకు ఇది దోహదం చేస్తోందిన వెల్లడించారు. కరోనా వైరస్‌ కోసం ఉపయోగిస్తున్న మందులు హృదయజనిత రోగాల మందులతో చర్యలు జరిపే ప్రమాదం ఉందని...

Published : 18 May 2020 16:45 IST

గుండె వైఫల్యానికి దారి తీస్తున్న కరోనా వైరస్‌

వాషింగ్టన్‌: తీవ్రమైన గుండె, రక్తనాళాల వ్యాధులకు కొవిడ్‌-19 కారణమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుండె వైఫల్యం, గుండెపోటు, రక్తం గడ్డకట్టేందుకు ఇది దోహదం చేస్తోందిన వెల్లడించారు. కరోనా వైరస్‌ కోసం ఉపయోగిస్తున్న మందులు హృదయజనిత రోగాల మందులతో చర్యలు జరిపే ప్రమాదం ఉందని అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు.

అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్ ఎమర్జన్సీ మెడిసిన్‌లో ఈ అధ్యయనం ప్రచురించారు. ఇప్పటి వరకు కొవిడ్‌-19 అనగానే శ్వాస సమస్యలపైనే ఎక్కువగా దృష్టి సారించారని శాస్త్రవేత్తలు తెలిపారు. మరణానికి దారితీసే గుండె, రక్తనాళాల వ్యాధులపై దృష్టి పెట్టలేదని వెల్లడించారు.

‘కొవిడ్‌-19 లక్షణాలున్న వారిని ఎక్కువగా పరిశీలించే కొద్దీ శరీరం, గుండె-రక్తనాళాల వ్యవస్థపై దీని ప్రభావాన్ని మరింత అర్థం చేసుకోగలిగాం’ అని వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్త విలియమ్‌ బ్రాడీ తెలిపారు. తొలిసారి కరోనా సోకిన వారిలో 24% మంది తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. కొవిడ్‌-19 వల్లే ఇలా జరుగుతోందా లేదా గతంలో గుర్తించని గుండె జబ్బులు ముదురుతున్నాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. గుండెవైఫల్యం చెందిన రోగుల్లో సగం మందికి అంతకుముందు అధిక రక్తపోటు సమస్య లేదని వెల్లడించారు.

కొవిడ్‌-19, ఇతర రోగాల వల్ల శరీరంలో ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్‌ (మంట) జరుగుతోందని, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తోందని పరిశోధకులు వివరించారు. ఇన్‌ఫ్లూయెంజా, ఇతర వైరస్‌లు కొవ్వు గడ్డకట్టే వేగం పెంచుతాయన్నారు. కరోనాకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటి మందులు, అంతకు ముందే వాడుతున్న హృదయ సంబంధ ఔషధాలతో చర్యలు జరిపే ప్రమాదముందని హెచ్చరించారు. ఇది గుండె వైఫల్యాన్ని మరింత వేగవంతం చేస్తుందని, కార్డియోమైయోపతికి దారితీస్తుందని వెల్లడించారు. కరోనాపై అనుభవం వచ్చే కొద్దీ అది శ్వాసవ్యవస్థను దాటేసి ప్రభావం చూపుతున్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని