ట్రంప్‌ మాటలతో భారత్‌కు కిక్కు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌కు ప్రోత్సాహం అందించాయి! మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులు పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్తగా వారం రోజుల్నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తీసుకుంటున్నానని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.....

Published : 19 May 2020 16:06 IST

క్లోరోక్విన్‌ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం

ముంబయి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌కు ప్రోత్సాహం అందించాయి! మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులు పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్తగా వారం రోజుల్నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తీసుకుంటున్నానని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 పోరులో ముందువరుసలో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది సైతం వీటిని ఉపయోగిస్తున్నారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులను మొదట భారత్‌ నిషేధించింది. కొవిడ్‌-19ను నియంత్రించడంలో ఈ ఔషధం ‘గేమ్‌ ఛేంజర్‌’గా మారుతుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎగుమతి చేయాలని ప్రధాని మోదీని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు మోదీ కొన్ని సడలింపులు ఇచ్చారు. బ్రెజిల్‌ సైతం వీటిని దిగుమతి చేసుకుంది. మానవతా దృక్పథంతో అఫ్గానిస్థాన్‌, మయన్మార్‌, డొమినిక్‌ రిపబ్లిక్‌ వంటి చిన్నదేశాలకు పంపించింది.

సాధారణంగా భారత్‌లో నెలకు 1.2 మిలియన్‌ క్లోరోక్విన్‌ మాత్రల్ని ఉత్పత్తి చేస్తుంది. అమెరికా ఎగుమతి చేయాలని కోరడంతో నెలకు 3 మిలియన్‌ మాత్రల్ని ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తయారీదారులకు కోరింది. ఇప్పుడు ట్రంప్‌ తానే స్వయంగా క్లోరోక్విన్‌ తీసుకుంటున్నానని చెప్పడం భారత ఫార్మా పరిశ్రమకు ఉత్సాహం కలిగించింది. ఫలితంగా ఎగుమతులు మరిన్ని పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్లోరోక్విన్‌తో కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ ట్రంప్‌ మాటలతో విశ్వాసం పెరుగుతుందని ధీమా వెలిబుచ్చుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని