పంచన్‌ లామా ఎక్కడ.. 

బౌద్ద మత అత్యున్నత గురువు పంచన్‌ లామా ఆచూకీ వెంటనే బహిర్గతం చేయాలని అమెరికా చైనాను డిమాండ్‌ చేసింది.

Updated : 19 May 2020 17:23 IST

 చైనాకు అమెరికా డిమాండ్‌

వాషింగ్టన్‌: టిబెట్‌కు చెందిన బౌద్ధమత అత్యున్నత గురువు పంచన్‌ లామా ఆచూకీ వెంటనే బహిర్గతం చేయాలని అమెరికా చైనాను డిమాండ్‌ చేసింది. టిబెట్‌ బౌద్ధంలో పంచన్‌ లామాను దలైలామా తర్వాత అతి ముఖ్య ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. మత స్వాతంత్ర్యానికి తాము అమిత ప్రాముఖ్యతనిస్తామని... అయితే చైనాలో అన్ని మతాల వాళ్లు  అణచివేతకు, వివక్షకు గురౌతున్నారని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో విమర్శించారు. 11వ పంచన్‌ లామా అదృశ్యమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

టిబెటన్ల ఉనికి నిర్మూలనకే...

టిబెటన్ల మత, భాషా, సాంస్కృతిక ఉనికిని నిర్మూలించేందుకు చైనా కంకణం కట్టుకుందని... అందులో భాగంగానే లారంగ్‌ గార్‌, యాచెన్‌ గార్‌ బౌద్ధ కేంద్రాలను నాశనం చేసిందని అమెరికా ఆరోపించింది. టిబెటన్లు కూడా ఇతర మతస్తుల మాదిరిగానే ప్రభుత్వ జోక్యం లేకుండా, వారి సంప్రదాయానుసారంగా విద్య నేర్చుకొనేందుకు, తమ మత గురువులను ఎంచుకొని, పూజించేందుకు అవకాశముండాలని తాము కోరుతున్నామని పాంపియో అన్నారు.

పంచన్ లామా ఎక్కడ? 

అయితే శతాబ్దాలుగా టిబెట్‌ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది. 1995లో బాలుడిగా ఉన్న గెధున్‌ చౌకీ నీమాను 11వ  లామాగా బౌద్ధమత గురువులు గుర్తించారు. అయితే ఆయనను ఆరేళ్ల వయసులో చైనా నిర్భంధించింది. ప్రపంచంలోనే అతిపిన్న రాజకీయ ఖైదీగా పేరొందిన నైమా, తదనంతరం కనిపించకుండా పోయారు. నైమాకు బదులుగా తమ కనుసన్నలలో ఉండే మరో బాలుడు గియాల్ట్సెన్‌ నోర్బూను పంచన్‌ లామాగా చైనా పేర్కొంది. 

తర్వాతి దలైలామా ఎవరు?

84ఏళ్ల ప్రస్తుత దలైలామా తనకు రెండేళ్ల వయసులోనే ఆ స్థానానికి ఎంపికయ్యారు. నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన దలైలామాపై వేర్పాటువాదిగా చైనా ముద్ర వేసింది. బౌద్ధమత విశ్వాశాల ప్రకారం దలైలామా మరణానంతరం మరో జన్మనెత్తుతారని నమ్ముతారు. వివిధ మత ప్రక్రియల అనుసారం ఆయనను బౌద్ధ మత గురువులు గుర్తిస్తారు. అయితే దలైలామా వారసుణ్ని నియమించేందుకు తమకు అధికారముందని చైనా వాదిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని