హెచ్‌సీక్యూ ఔషధం ఓ రక్షణ రేఖ: ట్రంప్‌

కరోనా వైరస్‌ సోకకుండా తాను ప్రతిరోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ) ఔషధాన్ని తీసుకోవడాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గట్టిగా సమర్థించారు. ఈ మందు ‘రక్షణ రేఖ’గా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు......

Updated : 20 May 2020 12:19 IST

క్లోరోక్విన్‌ వాడకాన్ని మరోసారి గట్టిగా సమర్థించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకకుండా తాను ప్రతిరోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ) ఔషధాన్ని తీసుకోవడాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గట్టిగా సమర్థించారు. ఈ మందు ‘రక్షణ రేఖ’గా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. మరికొంత కాలం తాను ఈ ఔషధాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి అభద్రత అవసరం లేదని తాను భావిస్తు న్నట్టు చెప్పారు.

తాను ప్రచారం కల్పించడం వల్లే హెచ్‌సీక్యూకి చెడ్డపేరు వచ్చిందని ట్రంప్‌ అన్నారు. ఇంకెవరైనా ఈ మందు గురించి చెప్పి ఉంటే అద్భతమైన ఔషధంగా అభివర్ణించేవారని అభిప్రాయపడ్డారు. ఇది చాలా శక్తిమంతమైన ఔషధమని.. దీని వల్ల ఎలాంటి హాని ఉండదని పునరుద్ఘాటించారు. అందువల్లే కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న అనేక మంది సిబ్బందికి దీన్ని ప్రతిపాదించానని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు హెచ్‌సీక్యూ వాడకంపై సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో ఈ ఔషధం మెరుగైన ఫలితాలు చూపిన అధ్యయనాలు ఉన్నట్లు గుర్తుచేశారు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం తప్పుడు ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కావాలనే చనిపోయే స్థితిలో ఉన్నవారికి ఈ ఔషధాన్ని ఇచ్చి ప్రతికూల ఫలితాలు వెల్లడించారన్నారు.

మరోవైపు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మాత్రం తాను హెచ్‌సీక్యూ తీసుకోవడం లేదని తెలిపారు. తనకు వైద్యులు ఎలాంటి ఔషధాలు సిఫార్సు చేయలేదని పేర్కొన్నారు. అయితే, వైద్యుల సూచన మేరకు అమెరికా ప్రజలెవరైనా హెచ్‌సీక్యూ తీసుకోవడాన్ని మాత్రం తాను వ్యతిరేకంచలేనన్నారు. మరోవైపు తాను ప్రతిరోజు హెచ్‌సీక్యూ తీసుకుంటున్నానని ట్రంప్‌ ప్రకటించడంపై అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కొవిడ్‌-19ను నయం చేయగలిగే సామర్థ్యం హెచ్‌సీక్యూకి ఉందో లేదో వైద్యపరంగా నిర్ధారణ కాకుండా అధ్యక్షుడు దీని వాడకాన్ని ప్రోత్సహించడం హానికరమని వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్‌ తనకు సోకకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజు హెచ్‌సీక్యూ ఔషధాన్ని తీసుకుంటున్నట్లు ట్రంప్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని