కోటి దాటిన ‘ఆయుష్మాన్‌’ లబ్ధిదారులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కోటి దాటింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తాజా లబ్ధిదారుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు........

Updated : 20 May 2020 15:21 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కోటి దాటింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తాజా లబ్ధిదారుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షిల్లాంగ్‌కు చెందిన పూజా థాపా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా అందిన సహకారాన్ని ఆమె ప్రధానితో పంచుకున్నారు. ‘‘పథకమే లేకుంటే చికిత్స చేయించుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. రుణం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడేది’’ అని ప్రధానికి థాపా వివరించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రెండేళ్లలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య కోటి దాటడం ప్రతి భారతీయుడు గర్వించే అంశం అన్నారు. అనేక మంది జీవితాల్లో ఈ పథకం ఎంతో మార్పు తీసుకొచ్చిందన్నారు. ఆయుష్మాన్‌ కింద చికిత్స పొందినవారంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పథకం విజయంలో కీలక పాత్ర పోషించిన నర్సులు, డాక్టర్లు, ఇతర వైద్యారోగ్య సిబ్బందిని ఈ సందర్భంగా మోదీ అభినందించారు. వీరందరి కృషి వల్లే అనేక మంది చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారంటూ వారి కృషి గుర్తించారు.

ఈ పథకం బడుగు బలహీన వర్గాల ఆదరణ చూరగొన్నదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకోవడం ఆయుష్మాన్‌ భారత్‌లో ఉన్న గొప్ప సౌకర్యమని గుర్తుచేశారు. తద్వారా వివిధ ప్రాంతాలకు వలసవెళ్లి పనిచేస్తున్నవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 2018న ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంక్షరణా పథకంగా దీన్ని అభివర్ణిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని