అంపన్‌: తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అంపన్‌ తుపాను పశ్చిమబంగా, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు తీర ప్రాంత జిల్లాల్ని అతలాకుతలం చేస్తున్నాయి.......

Updated : 20 May 2020 13:09 IST

వెల్లడించిన భారత వాతావరణ విభాగం

కోల్‌కతా: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అంపన్‌ తుపాను పశ్చిమబంగా, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు తీర ప్రాంత జిల్లాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 4-6 గంటల సమయంలో దిఘా, హతియా దీవుల వద్ద అంపన్‌ తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ అంచనావేసింది. తుపాను నేపథ్యంలో సముద్రంలో 4-5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్న అలలు పశ్చిమ బంగాలోని తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృంత్యుజయ మొహపాత్రా తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

* ఇప్పటికే ఒడిశాలో 1.3 లక్షలు, పశ్చిమబంగాలో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగ్లాదేశ్‌లో 20 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రస్తుతం తుపాను ఒడిశాలోని పారాదీప్‌ తీరానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

* భారత నావికా దళం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు సన్నద్ధంగా ఉంది.

* తుపాను నేపథ్యంలో కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాల్ని గురువారం సాయంత్రం 5గంటల వరకు రద్దు చేశారు.

* పశ్చిమబంగాలో ప్రభావిత జిల్లాలను ‘రెడ్‌ ప్లస్‌ జోన్లు’గా ప్రకటించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

* రెండు రాష్ట్రాల్లో దాదాపు 40 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని మోహరించారు.

* పెనుతుపాను అంపన్‌ తీవ్రతకు తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. ఈదురు గాలులకు ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. తీరం కోతకు గరై మరికొన్ని ఇళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం సూచించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నంలో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

* తెలంగాణపై ఈ తుపాను ప్రభావం ఏమీ ఉండకపోవచ్చునని ఓ వాతావరణ విభాగం ఉన్నతాధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని