కర్బన ఉద్గారాల్లో 26 శాతం తగ్గుదల

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు ఆరోగ్య రంగంతో పాటు ఆర్థిక రంగాన్నీ నిట్టనిలువునా ముంచేసింది. లక్షలాది మంది ప్రాణాల్ని బలితీసుకొని వేలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.........

Updated : 20 May 2020 15:17 IST

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు ఆరోగ్య రంగంతో పాటు ఆర్థిక రంగాన్నీ నిట్టనిలువునా ముంచేసింది. లక్షలాది మంది ప్రాణాల్ని బలితీసుకొని వేలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కానీ, కరోనా విజృంభణకు ముందు ప్రపంచాన్ని కలవరపెట్టిన వాతావరణ కాలుష్యాన్ని మాత్రం భారీగా తగ్గించింది. కరోనా చేసిన మేలేదైనా ఉందా అంటే.. అది ఇదొక్కటనే చెప్పాలి. లాక్‌డౌన్‌తో పాటు వివిధ దేశాల్లో విధించిన కఠిన ఆంక్షల వల్ల ప్రజారవాణా, పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో తగ్గాయి. బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం..

> ‘నేషనల్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం జనవరి-ఏప్రిల్‌ మధ్య ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 17 శాతం మేర పడిపోయాయి. అదే భారత్‌లో ఈ తగ్గుదల 26 శాతంగా నమోదుకావడం గమనార్హం.

> 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాల తగ్గుదల 4.4 శాతం నుంచి 8 శాతం వరకు ఉండొచ్చని అంచనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయి వార్షిక తగ్గుదల ఇదే తొలిసారి.  

> బ్రిటన్‌లో 30.7 శాతం, అమెరికాలో 31.6 శాతం, చైనాలో 23.9 శాతం మేర కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి.

> ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు తీవ్ర స్థాయిలో ఉన్న దశలో రోజువారీ ఉద్గారాల స్థాయి 17 శాతం మేర పడిపోయి 2006 నాటి స్థాయికి చేరాయి.

> రోడ్డు రవాణా వల్ల వెలువడే ఉద్గారాల్లో 43 శాతం తగ్గుదల నమోదైంది. ఇంధన ఉత్పత్తి వల్ల వచ్చే ఉద్గారాల్లో 19 శాతం, పరిశ్రమల కార్యకలాపాల వల్ల వెలువడే ఉద్గారాల్లో 25 శాతం, విమానయానం వల్ల ఉత్పత్తి అయ్యే ఉద్గారాలు 10 శాతం మేర తగ్గాయి.

> అయితే, ఇప్పటికే గణనీయంగా పేరుకుపోయిన ఉద్గారాల వల్ల తాజా తగ్గుదల వాతావరణ మార్పుల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. వాతారణ మార్పులను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రస్తుతం నమోదైన తగ్గుదల ఏమాత్రం సరిపోదు.

ఆర్థిక రంగాన్ని గాడినపెట్టాలన్న లక్ష్యంతో ఉద్గారాల తగ్గింపు విషయంలో రాజీపడకూడదని అధ్యయనం ఆయా దేశాలకు సూచించింది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామకం సహా ఇతర రంగాల పునరుత్తేజానికి రూపొందించే ప్రణాళికల్లో కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా చేర్చాలని హితవు పలికింది. ముఖ్య రవాణా వల్ల వెలువడుతున్న ఉద్గారాల కట్టడికి సమగ్ర విధానం ఉండాలని సూచింది. కాలుష్య నివారణకు తాజా పరిస్థితుల్ని అవకాశంగా భావించాలే తప్ప అవరోధంగా కాదని హితవు పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని