అమెరికాలో అమాంతం పెరిగిన నిరుద్యోగులు

కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా తీవ్ర నష్టం చవిచూసింది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల్లో సుమారు 39 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు...

Updated : 22 May 2020 13:08 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా తీవ్ర నష్టాన్ని చవి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల్లో సుమారు 39 మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని అక్కడి ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఇంకా నిరుద్యోగుల సంఖ్య తగ్గడం లేదని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌ వేళ అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూతపడడంతో ఆర్థికంగా చితికిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. గత వారం 2.4 మిలియన్ల మంది నిరుద్యోగులుగా దరఖాస్తు చేసుకున్నారని కార్మికశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 38.6 మిలియన్లకు చేరాయి.

ఏడు వారాలుగా ఈ దరఖాస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా, ఈ గణంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పింది. కరోనా రాక ముందు పరిస్థితితో పోలిస్తే ఇది పదిశాతం పెరిగిందని పేర్కొంది. మరోవైపు వాణిజ్య సంస్థలు ఇంకా నష్టాలనే చవిచూస్తున్నాయి. దాంతో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దరఖాస్తుల సంఖ్య క్రమంగా తగ్గడం శుభపరిణామమే అయినా, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఓ వాణిజ్య రంగ నిపుణుడు పేర్కొన్నారు. మరోవైపు మే చివరి నాటికి లేదా జూన్‌లో అమెరికాలో నిరుద్యోగ శాతం 20 నుంచి 25కు పెరిగే అవకాశముందని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అన్నారు. 90 ఏళ్ల క్రితం మహా మాంద్యంలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 3.3 లక్షలు దాటింది. అత్యధిక కేసులు, మరణాలతో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు అక్కడ 16 లక్షల కేసులు నమోదవ్వగా, 95 వేల మందికిపైగా మరణించారు. అమెరికా తర్వాత రష్యా, బ్రెజిల్‌, స్పెయిన్‌, యూకే ఉన్నాయి. మరోవైపు భారత్‌లోనూ కేసులు అధికంగా నమోదవుతుండటం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని