కరాచీలో కుప్పకూలిన విమానం

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మోడల్‌ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్‌ ఎయిర్‌

Updated : 22 May 2020 19:34 IST

ప్రమాద సమయంలో విమానంలో 99మంది

జనావాసాల మధ్య కూలడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మలీర్‌లోని ఓ మోడల్‌ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్‌ ఎయిర్‌ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్‌ సత్తార్‌ ధ్రువీకరించారు. విమాన ప్రమాదం గురించి ఇప్పుడేమీ మాట్లాడలేమన్నారు. విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో శిక్షణ పొందినవారేనని చెప్పారు. ప్రమాద ఘటనపై సమాచారం అందించడంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు.   లాహోర్‌ నుంచి కరాచీకి వస్తున్న ఏ-320 విమానంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. రంజాన్‌ వేడుకలకు దేశమంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

కాసేపట్లో ల్యాండింగ్‌.. అంతలోనే విషాదం!

ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్యశాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ విమానం జనావాసాల మధ్య కుప్పకూలడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఒక నిమిషం వ్యవధిలో విమానం ల్యాండింగ్‌ కావాల్సి ఉండగా.. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
విమాన ప్రమాదంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి వెళ్లిన పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ సీఈవో అర్షద్‌ మాలిక్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలిపారు. తక్షణమే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతులకు తన సంతాపం తెలిపారు.  అలాగే, ఈ ఘటనపై విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై తక్షణ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఈ ఘటనపై విచారం వ్యక్తంచేశారు. ఈ సమయంలో పాకిస్థాన్‌ ఎయిర్‌ లైన్స్‌కు అండగా నిలిచి సహాయక చర్యల్లో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. 

ఎంతమంది మరణించారో ఇప్పుడే చెప్పలేం!

ఈధి ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి షాద్‌ ఈధి మాట్లాడుతూ.. విమానం నుంచి 13 మృతదేహాలను బయటకు తీసి సహాయక సిబ్బంది పలు ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నవారిలో దాదాపు 25 నుంచి 30మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తీసుకెళ్లారని వివరించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది మృతిచెందారనే విషయాన్ని మాత్రం ఇప్పట్లోనే చెప్పలేమన్నారు. 

ఈ ఘటనపై సింధ్‌ ప్రాంత గవర్నర్‌ ఇమ్రాన్‌ ఇస్మాయిల్‌ స్పందించారు. విమానం జనావాసాల మధ్య కూలిపోవడంతో ఈ ప్రాంతంలో ఎంతమంది మృతిచెందారనే విషయంలో ఆందోళన నెలకొందన్నారు. సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించామన్న ఆయన.. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని