8 కోట్ల మంది చిన్నారులు ప్రమాదంలోకి..

చిన్నారుల్లో ప్రాణాంతక వ్యాధులను ముందుగానే నివారించి, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు కొనసాగిస్తున్న టీకా కార్యక్రమాన్ని కొవిడ్ 19 మహమ్మారి దెబ్బతీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, గవి అండ్ సబిన్‌ వ్యాక్సిన్‌ ఇనిస్టిట్యూట్ హెచ్చరించాయి.

Updated : 23 May 2020 11:52 IST

దిల్లీ: చిన్నారుల్లో ప్రాణాంతక వ్యాధులను ముందుగానే నివారించి, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు కొనసాగిస్తున్న టీకా కార్యక్రమాన్ని కొవిడ్ 19 మహమ్మారి దెబ్బతీస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, గవి అండ్ సబిన్‌ వ్యాక్సిన్‌ ఇనిస్టిట్యూట్ తెలిపాయి. టీకాలకు దూరం కావడం సంవత్సరం లోపు చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మంది చిన్నారుల జీవితాలకు ప్రమాదంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశాయి.

‘టీకాతో రోగనిరోధక శక్తి పెంపొందించి, నివారించగలిగే తట్టు, పోలియో వంటి వ్యాధుల కట్టడిలో ప్రపంచ దేశాలు సాధించిన పురోగతిని కొవిడ్ 19 మహమ్మారి దెబ్బతీస్తోంది’ అని ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు.  లాక్‌డౌన్‌ నిబంధనలు, కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో తల్లిదండ్రులు పిల్లలతో బయటకు వెళ్లడానికి సంకోచిస్తుండటం, ఆరోగ్య కార్యకర్తలను కొవిడ్ సేవలకు నియమించడం, కరోనా నివారణ కోసం సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో కొన్ని దేశాలు కొంతకాలం పాటు సామూహిక టీకా కార్యక్రమాన్ని నిలిపివేయడం వంటి పలు కారణాలు.. చిన్నారులను టీకాలకు దూరం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తట్టు టీకా కార్యక్రమాన్ని 27 దేశాలు, పోలియో టీకా కార్యక్రమాన్ని 38 దేశాలు నిలిపివేయడం గమనార్హం.

విమాన ప్రయాణాల మీద ఆంక్షల ప్రభావం  టీకాల రవాణా మీద పడిందని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతోందని యునిసెఫ్ హెచ్చరించింది. వాటి తరలింపు నిమిత్తం ఆంక్షలను సడలించాలని కోరింది. కొన్ని దశాబ్దాలుగా ఇతర వ్యాధులపై సాధించిన పురోగతిని ఒక్క వ్యాధిని కట్టడి చేయాలనే లక్ష్యంతో దెబ్బతీయొద్దని సూచించించింది. అయితే ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ఉగాండా, లావోస్‌ వంటి కొన్ని దేశాలు టీకా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. అది కూడా సామాజిక దూరం వంటి నిబంధనలను పాటిస్తూనే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని