
వారి విషయంలో కేంద్రం పాత్ర పరిమితమే
దిల్లీ: లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగినంత చేశాయని నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. వారి రక్షణ విషయంలో కేంద్రం పాత్ర పరిమితమేనన్నారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా నగరాల్లో పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న కార్మికులు ఉపాధి కోల్పోయి, తిండికి కూడా దూరమయ్యారు. నగరాల్లో ఉండలేక చివరికి కాలినడకన వందల కిలోమీటర్లు నడుస్తూ సొంతూళ్లకు చేరుకున్నారు. ఆ క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో అమితాబ్ కాంత్ మీడియాతో మాట్లాడుతూ..‘వలసదారుల సమస్య ఒక సవాలుగా ఉందని అర్థం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా రూపొందించిన చట్టాలు ఆర్థిక వ్యవస్థలోకి అనధికారిక కార్మికులను తీసుకురావడానికి కారణమయ్యాయి. వలస కూలీలకు ఏ ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. భారత్ లాంటి పెద్ద దేశంలో కేంద్రం పాత్ర పరిమితమే. అయినా ప్రతి కార్మికుడిని జాగ్రత్తగా చూసుకోడానికి చాలా చేయగలిగామని భావిస్తున్నాను’ అని వెల్లడించారు. అయితే ప్రజారవాణా మీద ఆంక్షలు ఉండటంతో కార్మికులను సొంతూళ్లకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.