ఐదుగురు ఉపాధ్యక్షులు.. 4 వెంటిలేటర్లు..!

శరీరంలో కరోనావైరస్‌ విజృంభించిన సమయంలో రోగికి వెంటిలేటర్లపై కృత్రిమ శ్వాస అందించడం అత్యంత కీలకం. ఇదే చావో.. బతుకో తేలుస్తుంది...

Published : 24 May 2020 23:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: శరీరంలో కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో రోగికి వెంటిలేటర్లపై కృత్రిమ శ్వాస అందించడం అత్యంత కీలకం. ఇదే చావో.. బతుకో తేలుస్తుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనావైరస్‌ విజృంభిస్తోంది. ఇక్కడ చాలా దేశాల్లో కనీసం వెంటిలేటర్ల లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మొత్తం 54 దేశాలకు గానూ 41 దేశాల్లోని వెంటిలేటర్ల సంఖ్యను కలిపితే దాదాపు 2,000 ఉంటాయి. వీటిల్లో 10 దేశాల్లో వెంటిలేటర్‌ అన్న పరికరమే లేదు. ఇక చాలా దేశాల్లో సాధారణ సబ్బులు, శానిటైజింగ్‌ వినియోగించేవి కూడా లేవంటే ఆశ్చర్యంపోనవసరంలేదు. 

విజృంభిస్తున్న కరోనా..

దక్షిణ సుడాన్‌లో వైరస్‌ విజృంభిస్తోంది. అక్కడ 10 మంది మంత్రులకు ఇది సోకింది. ఈ మంత్రులు కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సభ్యుడిని కలవడంతో వారికి కూడా సోకింది.  ఈ దేశానికి మొత్తం ఐదుగురు ఉపాధ్యక్షులు ఉన్నారు. కానీ దేశం మొత్తంలో నాలుగు వెంటిలేటర్ల మాత్రమే ఉన్నాయి. వీరిలో ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్‌ మాచెర్‌కు కరోనా సోకింది. ఆయన భార్యకు కూడా పాజిటీవ్‌ వచ్చింది. దేశం మొత్తంలో 655కరోనావైరస్‌ కేసులు నమోదయ్యాయి. చాలా ఆఫ్రికా దేశాలలో కేసుల పెరుగుదల వేగం ఎక్కువగా ఉంది. గ్యునియాలో ప్రతి ఆరు రోజులకు,  ఘనాలో ప్రతి తొమ్మిది రోజులకు కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. 

ఆగని హింస..
ఆఫ్రికాలోని చాలా దేశాల్లో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. ఒక పక్క కరోనావైరస్‌ వ్యాపిస్తున్నా హింసాత్మక దాడులకు విరామం ఇవ్వడంలేదు. దక్షణి సుడాన్‌లో ఇటీవల రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 300 మంది  ప్రాణాలు కోల్పోయారు. ఆరేళ్ల అంతర్యుద్ధానికి విరామం ఇస్తూ గత ఫిబ్రవరిలో ఒప్పందం జరిగింది. కానీ, ఆ తర్వాత రెండు జాతుల మధ్య ఘర్షణలు మాత్రం ఆగలేదు. ఈ దాడుల్లో రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు, నర్సులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కరోనా సహాయక చర్యలకు ఇవి కూడా అడ్డంకిగా మారుతున్నాయి. దీంతోపాటు హింసాత్మక ప్రాంతాల నుంచి భారీగా వలసపోవడం కరోనా వ్యాప్తికి దోహదం చేస్తుందని భయపడుతున్నారు. 

2కోట్ల మందికి 11 వెంటిలేటర్లు..

పశ్చిమాఫ్రికా దేశాల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. బుర్కినా ఫాసో దేశంలో మొత్తం జనాభా రెండు కోట్లు. ఇక్కడ వెంటిలేటర్ల సంఖ్య 11. ఆఫ్రికాదేశాల్లో  కనీసం ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ పడకలు కూడా లేవు. 43 మూడు దేశాల్లో ప్రతి పదిలక్షల మందికి 5 ఐసీయూ పడకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ దాతలు ఇచ్చిన వెంటిలేటర్లే శరణ్యమయ్యాయి. చైనా దిగ్గజ కంపెనీ అలీబాబా అధినేత జాక్‌మా ఆఫ్రికాదేశాలకు 500 వెంటిలేటర్లను దానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని