‘టిక్‌టాక్‌’పై దెబ్బ పడిందా?

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాప్‌పై గత కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమౌతున్న విషయం తెలిసిందే. భారత్‌లో కూడా ‘బ్యాన్‌ టిక్‌టాక్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా జరిగింది. తాజాగా వీటి ప్రభావం టిక్‌టాక్‌పై పడిందా?అంటే తాత్కాలికంగా అవుననే సమాధానం వస్తోంది.

Published : 27 May 2020 00:24 IST

ప్లేస్టోర్‌లో భారీగా తగ్గిన రేటింగ్‌, డౌన్‌లోడ్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాప్‌పై గత కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమౌతున్న విషయం తెలిసిందే. భారత్‌లో కూడా ‘బ్యాన్‌ టిక్‌టాక్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా జరిగింది. తాజాగా వీటి ప్రభావం టిక్‌టాక్‌పై పడిందా?అంటే తాత్కాలికంగా అవుననే సమాధానం వస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లను పరిశీలిస్తే అంతకు ముందు రెండు నెలల కంటే భారీ స్థాయిలో పడిపోయింది. ఏప్రిల్‌లో 34శాతం, మే(23 తేదీ నాటికి)లో 28శాతం డౌన్‌లోడ్‌లు పడిపోయినట్లు సమాచారం. ఇది అంతకు ముందు రెండు నెలల్లో(మార్చిలో 8శాతం, ఫిబ్రవరిలో 7శాతం) పెరుగుదల ఉండగా ఏప్రిల్‌, మే నెలల్లో భారీగా తగ్గింది. మార్చి నెలలో దాదాపు మూడున్నర కోట్ల వినియోగదారులు దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగా ఏప్రిల్‌ నాటికి 2.3కోట్లకు, మే నెలలో 1.7కోట్లకు పడిపోవడం గమనార్హం. 

అయితే, టిక్‌టాక్‌ డౌన్‌లోడ్‌లో పెరుగుదల క్షీణించడానికి ప్రధానంగా రెండు కారణాలు ప్రభావితం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా జరిగిన ‘బ్యాన్‌ టిక్‌టాక్‌ ఇన్‌ ఇండియా’ ప్రచారం దీనిపై ప్రభావం చూపించిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో రేటింగ్‌ భారీగా పడిపోవడమే దీనికి నిదర్శణంగా చెబుతున్నారు. మొదట్లో ఈ యాప్‌ రేటింగ్‌ 4పైనే ఉండగా ప్రస్తుతం అది 1.4కి పడిపోయింది. దీనికితోడు కేంద్రప్రభుత్వం స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని చేసిన సూచన కూడా దీనిపై ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా చైనాకు చెందిన వస్తువులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో అది టిక్‌టాక్‌పై కూడా పడొచ్చని మార్కెట్‌ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. టిక్‌టాక్‌లో వస్తున్న అభ్యంతరకర వీడియోలపై గత కొంత కాలంగా వ్యతిరేకత వస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే, అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కోట్ల డౌన్‌లోడ్‌లు జరిగినట్లు ప్రముఖ అనలెటిక్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ ఈమధ్యే వెల్లడించింది. కరోనా వైరస్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌ కాలంలో ఈ యాప్‌ వాడకం మరింత పెరిగినట్లు అంచనా వేసింది. కేవలం భారత్‌లోనే దాదాపు 32కోట్ల మంది వినియోగదారులు ఉండగా.. వారిలో 20కోట్ల మంది నెలవారి క్రియాశీల వినియోగదారులు ఉన్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఏర్పడ్డ సంక్షోభంతో ఇప్పటికే యూట్యూబ్‌, హాట్‌స్టార్‌, టిక్‌టాక్‌ వంటి యాప్‌లపై ఇచ్చే ప్రకటనల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఇది తాత్కాలిక పరిణామంగానే ఉండొచ్చని మార్కెట్‌ నిపుణులు, సంస్థల ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి..
టిక్‌టాక్‌@200 కోట్ల డౌన్‌లోడ్‌లు
దేశీయ ఉత్పత్తులకే పెద్దపీట..అమిత్‌ షా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని