Published : 27 May 2020 11:54 IST

ట్రంప్‌ నిజంగా ఒక ఫూల్‌: జో బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలోనూ మాస్కు ధరించకపోవడంతో ట్రంప్‌ను నిజమైన ఫూల్‌గా అభివర్ణించారు. అంతేకాకుండా ట్రంప్‌ నాయకత్వలోపమే అమెరికాలో లక్షకుపైగా ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమని విమర్శించారు. ‘బహిరంగా ప్రదేశాల్లో, సమూహాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్‌ అలా మాట్లాడటం నిజంగా అతని మూర్ఖత్వానికి నిదర్శనం’ అని ఓ వార్తా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్‌ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన అహంకారపూరిత ప్రవర్తన, తప్పుడు చర్యల ఫలితమే దేశంలో భారీ స్థాయిలో మరణాలకు కారణమని జో బైడెన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మాస్క్‌ ధరించడం అక్కడ రాజకీయ అంశంగా మారింది. దీనిలో భాగంగా డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకున్నారు. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన జో బైడెన్‌ తాజాగా అమెరికా మెమోరియల్‌ రోజున అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో బైడెన్‌ మాస్కుతో ఉన్న ఫోటోను కొందరు షేర్‌ చేస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎందుకు మాస్కు ధరించరో ఇది చూస్తే తెలుస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై అమెరికాలో ఇరు పార్టీ అభ్యర్థులు, విశ్లేషకుల మధ్య బహిరంగ చర్చకు దారితీసింది.

ఇదిలా ఉంటే, ట్రంప్‌ మాత్రం బహిరంగ కార్యక్రమాల్లో కూడా మాస్కు ధరించనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మిచిగాన్‌లోని ఫోర్డ్‌ కార్ల ప్లాంటును సందర్శించే సమయంలో మాత్రమే స్వల్ప సమయం మాస్కు ధరించినప్పటికీ.. మీడియా నన్ను ఇలా చూసే అవకాశం కల్పించనని పేర్కొనడం గమనార్హం. మెమోరియల్‌ రోజు కూడా మాస్కు లేకుండానే అక్కడి అధికారిక కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొన్నారు. ఈ సమయంలో భౌతిక దూరం సాధ్యంకాని ప్రాంతాల్లో, బహిరంగ సమూహాల్లో ముఖానికి తప్పకుండా మాస్కు ధరించాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీపీ) సిఫార్సు చేయడం గమనార్హం. కేవలం ఇంట్లో ఉన్న సమయంలోనే మాస్కు ధరించనవసరం లేదని సీడీసీపీ స్పష్టం చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts