నేపాల్‌ మ్యాప్‌కు బ్రేక్‌!

భారత్‌లోని భూభాగాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు బ్రేక్‌ పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ సభ్యుల.......

Published : 28 May 2020 02:27 IST

రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా

కాఠ్‌మాండూ: భారత్‌లోని భూభాగాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు బ్రేక్‌ పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ సభ్యుల అంగీకారం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడింది.

భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను ఇటీవల నేపాల్‌ రూపొందించింది. దీనికి నేపాల్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఇందుకోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు నేపాల్‌లోని వివిధ పార్టీల ఏకాభిప్రాయ సాధనలో ప్రధాని కేపీ శర్మ విఫలమయ్యారు. గోర్ఖా జాతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని ప్రధాని భావిస్తున్నారని, ఇందులో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది వారి ఆరోపణగా తెలుస్తోంది. దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షమైన నేపాల్‌ కాంగ్రెస్‌ తన వైఖరిని కేంద్ర వర్కింగ్‌ కమిటీలో చర్చించాకే చెబుతామని తెలిపింది. దీంతో రాజ్యాంగ సవరణ చేయాలన్న ప్రయత్నాలు వాయిదా పడ్డాయి.

అయితే, నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రాత్మకత ఆధారాలూ లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత్‌ ఇప్పటికే స్పష్టంచేసింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలు ఉన్నాయని భారత్‌ ఆక్షేపించింది.  టిబెట్‌లోని మానస సరోవర్‌ పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని