రూ.70లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ: జపాన్‌

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా జపాన్‌ విధించిన అత్యయిక స్థితిని ఎత్తివేసింది. ఈ సమయంలో దేశంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాజాగా మరో భారీ ప్యాకేజీ ప్రకటించింది. దాదాపు రూ.70లక్షల కోట్ల(1.1 ట్రిలియన్‌ డాలర్లు) ప్యాకేజీకి జపాన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Published : 27 May 2020 18:07 IST

టోక్యో: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా విధించిన అత్యయిక స్థితిని జపాన్‌ ఎత్తివేసింది. ఈ సమయంలో దేశంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాజాగా మరో భారీ ప్యాకేజీ ప్రకటించింది. దాదాపు రూ.70లక్షల కోట్ల (1.1 ట్రిలియన్‌ డాలర్లు) ఉద్దీపన ప్యాకేజీకి జపాన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో కొంత మొత్తాన్ని నేరుగా ఖర్చుచేస్తామని జపాన్ ఆర్థిక శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరోసారి మహమ్మారి విజృంభిస్తే ఎదుర్కొనేందుకు ముందస్తుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే అక్కడి అధికారులకు సూచించారు. 

అయితే దేశంలో అత్యవసర స్థితి కొనసాగుతున్న సమయంలోనే గతనెలలో మొదటి దఫా దాదాపు లక్ష ట్రిలియన్‌ డాలర్లను జపాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు కలిపి(2.18 ట్రిలియన్‌ డాలర్లు) రూ.150లక్షల కోట్లు కేటాయించినట్లు అయ్యింది. ఇది జపాన్‌ దేశ జీడీపీలో దాదాపు 40శాతమని అంచనా. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచంలో అత్యధికంగా ఖర్చు పెట్టిన దేశాల్లో అమెరికా సరసన జపాన్‌ చేరింది. అమెరికా దాదాపు 2.3 ట్రిలియన్‌ డాలర్లను కేటాయించింది.

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. కేవలం ఇప్పటి వరకు దేశంలో 17వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 825 మరణాలు సంభవించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని