మనసున్న రైతు.. వలస కూలీలు విమానంలో..!  

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. .....

Published : 27 May 2020 21:12 IST

దిల్లీ: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. పనిచేసే చోట ఆసరా కరవై మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా భార్యాబిడ్డలతో కాలినకడన, సైకిళ్లపైన తమ సొంతూళ్లకు వెళ్లే క్రమంలో అనేకమంది ప్రాణాల్ని సైతం కోల్పోతున్న విషాద ఘటనల్ని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో దిల్లీకి చెందిన ఓ రైతు తన వద్ద పనిచేసిన వలస కూలీల పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించి గొప్ప మనసు చాటుకున్నారు. తన వద్ద పనిచేసే 10 మంది కూలీలను సొంత మనుషులుగానే భావించి విమానంలో వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేసి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. దిల్లీ సమీపంలోని టిగిపూర్‌లో పుట్ట గొడుగులు సాగు చేసే పప్పన్‌ సింగ్‌ అనే రైతు వద్ద బిహార్‌కు చెందిన 10 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో వారంతా ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్న తరుణంలో వారిని విమానాల్లో తరలించేందుకు ఆయన రూ.70వేలు ఖర్చుచేశారు. అంతేకాదు, గత రెండు నెలలుగా వారికి ఆశ్రయం కల్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆ వలస కూలీలు గురువారం ఉదయం 6గంటలకు దిల్లీ విమానాశ్రయం నుంచి పట్నాకు బయల్దేరి వెళ్లనున్నారు.

నా సంతోషం మాటల్లో చెప్పలేను: లఖ్వీందర్‌
పప్పన్‌ సింగ్‌ వద్ద గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న లఖ్వీందర్‌ రామ్‌ వంటివారు దేశంలోని మిగతా వలస కూలీల మాదిరిగా కాకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంటికి చేరుకోగలుగుతున్నారు. ఈ సందర్భంగా లఖ్వీందర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘విమానంలో ప్రయాణం చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. కానీ, రేపు విమానాశ్రయం వద్దకు చేరుకున్న తర్వాత ఏం చేయాలనేదానిపై ఇబ్బందిగా అనిపిస్తోంది’’ అన్నాడు. 

వాళ్లకేదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను: రైతు

దీనిపై రైతు పప్పన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘నా వద్ద పనిచేస్తున్న కార్మికులంతా స్వస్థలాలకు వెళ్లేటప్పుడు ఏమైనా జరిగితే నన్ను నేను క్షమించలేనని అనుకున్నా. అందుకే విమానంలో పంపిస్తే వారు క్షేమంగా వెళ్తారని భావించాను. వాళ్లు నా సొంత మనుషులు’’ అని అన్నారు.  

తొలుత, వీళ్లంతా  శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు వెళ్లేందుకు రిజిస్టేషన్‌ చేయించుకున్నారు. అయితే ఉత్తరాదిన మండిపోతున్న ఎండల దృష్ట్యా వారిని విమానంలో పంపాలని పప్పన్ ‌సింగ్‌ నిర్ణయించుకున్నారు. అలాగే, వారు పట్నా విమానాశ్రయంలో దిగిన తర్వాత సహస్ర జిల్లాకు వెళ్లేందుకు బస్సు టిక్కెట్లు కూడా బుక్‌ చేసినట్టు పప్పన్‌ సింగ్‌ సోదరుడు సునీత్ సింగ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని