ఆ కర్కశ పోలీస్‌పై తప్పుడు వార్తలు

ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ మెడపై మోకాలు నొక్కిపెట్టి అతని మృతికి కారణమైన పోలిస్‌ అధికారిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని స్థానిక అధికారులు స్పష్టం చేశారు...

Updated : 28 May 2020 10:37 IST

సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు..

మినియాపొలిస్‌: ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ మెడపై మోకాలు నొక్కిపెట్టి అతని మృతికి కారణమైన పోలీస్‌ అధికారిపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు ప్రచారంలోకి వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు.  సోమవారం అతని మృతికి  సంబంధించిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమెరికాలో వివిధ రకాలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఘటనలో జార్జ్‌ మృతికి కారణమైన డెరెక్‌ చావిన్‌పై బుధవారం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రసారమయ్యాయి. గత అక్టోబర్‌లో దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించిన ర్యాలీలో డెరెక్‌ చావిన్‌ ‘మేక్‌ వైట్స్‌ గ్రేట్‌ అగెయిన్‌’ అనే టోపీ ధరించాడంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అది వైరల్‌గా మారి.. ఆందోళనలకు దారి తీసింది. దీంతో మినియాపొలిస్‌ అధికారులు వాస్తవాలను వెల్లడించారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి కారణమైన పోలీసులెవరూ ట్రంప్‌ ర్యాలీలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. అయితే, ‘మేక్‌ వైట్స్‌ గ్రేట్‌ అగెయిన్‌’ అనే టోపీ ధరించిన వ్యక్తి ఇంటర్నెట్‌ ట్రోలర్‌ అని, అతని పేరు జొనాథన్‌ లీ రిచెస్‌ అని తేలిందన్నారు. జొనాథన్‌ ఫొటోను.. డెరెక్‌ చావిన్‌గా చిత్రించి సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టారని అధికారులు స్పష్టంచేశారు. మరోవైపు జొనాథన్‌ ఓ మీడియాకు దీనిపై వివరణ ఇచ్చారు. ‘మేక్‌ వైట్స్‌ గ్రేట్‌ అగెయిన్‌’ అనే ఫొటోలో ఉంది తానేనని, అయితే.. ఆ టోపీపై ఉన్న కొటేషన్‌ మాత్రం తనది కాదని, ఎవరో కావాలనే మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో డెరెక్‌పై చేస్తున్న విద్వేషపూరిత పోస్టులు నిలిపివేయాలని మినియాపొలిస్‌ అధికారులు కోరారు.

ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోమవారం రాత్రి జార్జ్‌ ఫ్లాయిడ్‌(46) అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ను పట్టుకొని నేలకు అదిమిపెట్టారు. ఈ క్రమంలో డెరెక్‌ చావిన్‌ అనే పోలీస్‌ అధికారి ఆ వ్యక్తి మెడపై మోకాలు నొక్కిపెట్టి అదిమి పట్టాడు. దీంతో అతను ఊరిరాడక ఇబ్బంది పడ్డాడు. ‘నా గొంతుపై కాలు తీయండి’ అని అరిచినా డెరెక్‌ పట్టించుకోలేదు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా అతనికి ఊపిరాడడం లేదని చెప్పినా వినిపించుకోలేదు. అనంతరం జార్జ్‌ స్పృహ కోల్పోగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి డెరెక్‌ చావిన్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులను మంగళవారం విధుల నుంచి తొలగించారు. 

ఇదీ చదవండి:

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని