‘పుల్వామా’ తరహా కుట్ర భగ్నం!

పుల్వామాలో ఉగ్రవాదుల మరో భారీ పేలుళ్ల కుట్ర బయటపడింది. 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు స్వల్ప కాలంలోనే మరో భారీ పేలుళ్ల కుట్ర పన్నాగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పేలడానికి సిద్ధంగా ఉన్న కారు బాంబును పుల్వామాలోని భద్రతా దళాలు చేధించాయి.

Updated : 28 May 2020 12:17 IST

ఛేదించిన భద్రతా దళాలు..

శ్రీనగర్‌: పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. 2019లో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు మరోమారు అదే తరహా కుట్ర అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో పేలడానికి సిద్ధంగా ఉన్న కారు బాంబును భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ, పోలీసులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.

బాంబు అమర్చిన కారులో ఓ ఉగ్రవాది సంచరిస్తున్నట్లు పుల్వామా పోలీసులకు ఇటీవల సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది బృందాలుగా ఏర్పడి తనిఖీలు మొదలుపెట్టారు. బుధవారం రాత్రి ఒకచోట ఆ వాహనం కోసం కాపుకాచారు. చీకటి పడిన సమయంలో అనుమానిత వాహనం అక్కడకు చేరింది. దీంతో వెంటనే బలగాలు దానిపై కాల్పులు జరిపాయి. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తి పారిపోయాడు. అయితే వాహనం వెనుక భారీ డ్రమ్ములో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తించారు. దీంతో మరింత అప్రమత్తమైన పోలీసులు బాంబు నిర్వీర్య బృందాలను పిలిపించారు. వారు కూడా వాహనంలో భారీ ప్రమాదం పొంచి ఉందని తేల్చారు. దీంతో ఆ కారును బలగాలు పేల్చేశాయి. ఆ సమయంలోనే స్థానికులను అక్కడి నుంచి దూరప్రాంతాలకు తరలించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని