91 లక్షల మందిని తరలించాం: కేంద్రం  

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస జీవుల కష్టాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం........

Updated : 28 May 2020 17:30 IST

వలస కూలీల కష్టాలపై సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస జీవుల కష్టాలపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం తీసుకున్న చర్యలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరించారు. మే 1 నుంచి  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా దాదాపు 91 లక్షల మంది వలస కూలీలను రైళ్లు, రోడ్డు మార్గంలో తరలించినట్టు చెప్పారు. తరలించిన వారిలో 80శాతం మందికి పైగా కూలీలు యూపీ, బిహార్‌లకే వెళ్లారన్నారు. మే 1 నుంచి శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  ఈ సందర్భంగా వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం, రవాణా  వసతులతో పాటు ఫండింగ్‌ తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేం చేశాయనే దానిపై త్రిసభ్య ధర్మాసనం  సొలిసిటర్‌ జనరల్‌ను దాదాపు 50 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా నిరీక్షణ ఎందుకు? 
‘‘వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడం, వారికి ఆహారం సమకూర్చడంలో చాలా పెద్ద సమస్య ఉత్పన్నమైంది. అనేకమంది  రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా కొన్ని వారాల పాటు వారెందుకు ప్రయాణానికి నిరీక్షించాల్సి వచ్చింది? తమ కోసం డబ్బులేమైనా ఖర్చు పెట్టాలని అడుగుతున్నారా? రాష్ట్రాలు ఎలా చెల్లిస్తున్నాయి?’’ అని సొలిసిటర్‌ జనరల్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే, ఒకే సమయంలో అందరినీ స్వస్థలాలకు చేర్చలేకపోయినా.. వాళ్లు రైళ్లలో తమ ఇళ్లకు చేరే వరకు ఆహారం, ఆశ్రయం తప్పకుండా కల్పించాలి కదా అని వ్యాఖ్యానించింది.  

దీనిపై తుషార్‌ మెహతా స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా ఇప్పటివరకు దాదాపు 91లక్షల మందిని ఆయా రాష్ట్రాలకు తరలించామని బదులిచ్చారు. అలాగే, గత కొన్ని రోజుల నుంచి రైల్వేశాఖ 84లక్షల భోజనాలను సమకూర్చిందని వివరించారు.  చిట్టచివరి వలస కూలీని సైతం స్వస్థలాలకు చేర్చే వరకూ శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు సేవలను కేంద్రం కొనసాగిస్తుందని కోర్టుకు తెలిపారు. 

ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వలస జీవుల కష్టాలపై సుప్రీంకోర్టు మంగళవారం సుమోటోగా స్పందించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత తీసుకుని వీరికి ఉచితంగా తగిన రవాణా, ఆహారం, వసతి సదుపాయాలను వెంటనే కల్పించాలని ఆదేశించింది. కూలీల దయనీయ పరిస్థితులపై పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వెలువడిన కథనాలను కోర్టు తనకు తానుగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం విచారణ జరిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కూలీలకు ఉపశమనం కల్పించేలా ప్రభుత్వాలు కొన్ని చర్యల్ని చేపట్టినా వాటిలో లోటుపాట్లు ఉన్నాయని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు