పుల్వామా కారు బాంబుతో ప్రమాద ఘంటికలు..!

పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు తీసిన బాంబుదాడి ఘటన జరిగి ఏడాది దాటగానే అటువంటి దాడికే మరోమారు ఉగ్రవాదులు ప్రణాళిక రచించడం ఆందోళనకలిగించే అంశంగా మారింది. చివరి నిమిషంలో భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.

Published : 29 May 2020 15:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలు తీసిన బాంబుదాడి ఘటన జరిగి ఏడాది దాటగానే అటువంటి దాడికే మరోమారు ఉగ్రవాదులు ప్రణాళిక రచించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. చివరి నిమిషంలో భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై ఇప్పటికే భారత్‌-పాక్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కానీ, మారుతున్న పరిస్థితులు భద్రతా దళాలకు మరిన్ని సవాళ్లను విసురుతున్నాయి. ఇటువంటి శైలి దాడులు ఇరాక్‌, సిరియా వంటి చోట్ల జరుగుతుంటాయి. వీటిని కనుగొనడం, ఆపటం చాలా శ్రమతో కూడుకొన్న పని.

చివరి నిమిషంలో ఉప్పందండంతో..

పుల్వామా ప్రాంతంలో భారీ బాంబుతో ఓ కారు సంచరిస్తోందని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బుధవారం రాత్రి నుంచే రాష్ట్రీయ రైఫిల్స్‌, 182, 183 బెటాలియన్లకు చెందిన సీఆర్పీఎఫ్‌కు బలగాలు, కశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపులు సంయుక్తంగా పలు చోట్ల నిఘా వేశాయి. అర్ధరాత్రి దాటాక హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందినట్లు భావిస్తున్న ఆదిల్‌ అనే ఉగ్రవాది తెల్లటి సాంత్రో కారులో రాజ్‌పోరాలోని ‘అయినాగుండ్‌’ ప్రాంతానికి వచ్చాడు. కారులో 45 కేజీల అమ్మోనియం నైట్రేట్‌, నైట్రోగ్లిజరిన్‌ కలిపి తయారు చేసిన బాంబు ఉంది. అప్పటికి సమయం తెల్లవారుజామున 2.30 గంటలైంది. అక్కడ బలగాల కదలికలను గమనించిన కారును వదిలి ఉగ్రవాది అడవుల్లోకి పరారయ్యాడు.

సమీపంలోని బలగాల క్యాంపులు..!

కారు స్వాధీనం చేసుకొన్న ప్రదేశానికి 3 నుంచి 5 కిలోమీటర్ల లోపలే సీఆర్‌పీఎఫ్‌ 183 బెటాలియన్‌, రాష్ట్రీయ రైఫిల్స్‌ క్యాంపులు ఉన్నాయి. ఈ కారును బలగాల క్యాంపులపై దాడికి వినియోగించేందుకు తీసుకెళుతున్నట్లు భావిస్తున్నారు. ఒక సారి కారులో బాంబు అమర్చాక దానిని నిర్వీర్యం చేయడం దాదాపు అసాధ్యం. అందుకే బలగాలు ఆ వాహనాన్ని పేల్చేశాయి.

ఉగ్రవాదుల మధ్య సమన్వయం..

ఈ దాడి ప్రణాళిక జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబ, హిజ్బుల్‌ హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉగ్ర సంస్థలు పరస్పరం సహకరించుకొంటూ దాడులు నిర్వహిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వనరులు, కార్యకర్తలను పరస్పరం వినియోగించుకొంటున్నాయన్నారు. ముఖ్యంగా హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ సంస్థ ఇటువంటి దాడులను నిర్వహించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. 2019 మార్చి 30వ తేదీన బనిహాల్‌ వద్ద హిజ్బుల్‌ కారు బాంబు దాడికి విఫలయత్నం చేసింది. ఆ తర్వాత పట్టుబడ్డ ఐదుగురు ఉగ్రవాదులు హిజ్బుల్‌ కారు బాంబుదాడుల విషయాన్ని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో కెమికల్స్‌ కొని..

2019లో పుల్వామ దాడి తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను కొనుగోలు చేసే మార్గాలపై భద్రతా బలగాలు దృష్టిపెట్టాయి. అప్పట్లో అరెస్టైన వారిని విచారించగా.. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను ఒక ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు కారుబాంబులు తయారు చేయడానికి చాలా సాంకేతికత అవసరం. గతంలో పాక్‌ నుంచి వచ్చిన ఉమర్‌ అనే ఉగ్రవాది సీఆర్‌పీఎఫ్‌పై దాడికి అవసరమైన కారు బాంబును చేసినట్లు బలగాలు కనుగొన్నాయి. ఉగ్రవాదులు తమ కదలికలను నిగూఢంగా ఉంచడానికి వర్చువల్‌ సిమ్‌కార్డులను కూడా వినియోగిస్తున్నారు. గతంలో పుల్వామా దాడికి వీటిని వాడారు. ముంబయి దాడుల సమయంలోనూ ఉగ్రవాదులు ఇటువంటి సిమ్‌లతో తమ బాస్‌లకు సమాచారం అందించారు. ఈ సిమ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అమెరికాలో ఉంటారు. కంప్యూటర్‌లో ఒక టెలిఫోన్‌ నెంబర్‌ను సృష్టిస్తారు. దీనిని వాడటం కోసం సదరు సర్వీసు ప్రొవైడర్‌ అప్లికేషన్‌ను మన స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సోషల్‌ మీడియా ఖాతాలతో అనుసంధానిస్తే ఒక వెరిఫికేషన్‌ కోడ్‌ వస్తుంది. దానిని ఆ యాప్‌కు ఇస్తే వర్చువల్‌ సిమ్‌ యాక్టివ్‌ అవుతుంది. దీని నెంబర్లు ‘+1’ రూపంలో వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని