కరోనాపై పోరుకు 38వేల మంది వైద్యులు

భారత్‌లో కరోనాపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం వైద్యులకు ఇచ్చిన పిలుపునకు అపూర్వ స్పందన వచ్చింది. ఇప్పటివరకు 38వేల.......

Published : 29 May 2020 22:40 IST

దిల్లీ: భారత్‌లో కరోనాపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం వైద్యులకు ఇచ్చిన పిలుపునకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 38వేల మందికి పైగా వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. వీరిలో సైనిక ఆస్పత్రుల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన వారితో పాటు ప్రభుత్వ విశ్రాంత వైద్యులు, ప్రైవేటు రంగంలో పనిచేసిన వారూ ఉన్నట్టు తెలిపారు. మార్చి 25న కేంద్ర ప్రభుత్వం విశ్రాంత వైద్యులతో పాటు వైద్య రంగంలో పని చేస్తున్న వారందరూ ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనాపై యుద్ధంలో సహకరించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునకు స్పందించి ఇప్పటివరకు 38,162 మంది వాలంటీర్లుగా పనిచేసేందుకు రిజిస్టర్‌ చేయించుకున్నారని అధికారి తెలిపారు. నీతి ఆయోగ్‌ వీరందరి జాబితాను వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఆర్‌ఎఫ్‌)కు పంపించిందన్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో దేశ ప్రజా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమెరికా, ఇటలీ, యూకే, వియత్నాం వంటి పలు దేశాలు వైద్య రంగంలో పనిచేసి రిటైరైన ఉద్యోగులు కరోనాపై యుద్ధానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాయి. దేశంలో ఇప్పటివరకు 1,65,799 కేసులు నమోదు కాగా.. 4706మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని