‘గ్లోబల్‌ లీడర్‌’ కల సాకారం దిశగా..

భారత్‌ను ‘గ్లోబల్‌ లీడర్‌’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంవత్సర కాలంలో తన ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు.....

Published : 31 May 2020 00:45 IST

ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మోదీ బహిరంగ లేఖ

దిల్లీ: భారత్‌ను ‘గ్లోబల్‌ లీడర్‌’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంవత్సర కాలంలో తన ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, సాధించిన విజయాలను గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కి నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం..

అధికరణ 370 రద్దు ప్రజల్లో ఏకత్వాన్ని, దేశ సమగ్రతను చాటిందని మోదీ తెలిపారు. శతాబ్దాలుగా పరిష్కారం దొరకని అయోధ్య రామమందిర వివాదం తన పాలనాకాలంలోనే సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణగడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మహిళల గౌరవ ప్రతిష్ఠలను కాపాడుతూ.. ముమ్మారు తలాక్‌ సంప్రదాయాన్ని చెత్తబుట్టలో వేశామని చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశ దయాగుణాన్ని, సమ్మిళిత తత్వాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. త్రిదళాధిపతి నియామకం సైన్యంలో సమన్వయాన్ని పెంపొందించిందన్నారు.

రైతులు, మహిళలు, యువత సాధికారిత కోసం..

పేద, రైతు, మహిళ, యువత ఇలా అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మోదీ లేఖలో వివరించారు. రైతులకు పెట్టుబడి సాయమందించే ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ ఇప్పుడు అందరు రైతులకు వర్తింపజేశామని తెలిపారు. ఈ పథకం కింద ఒక్క సంవత్సరం కాలంలోనే రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని గుర్తుచేశారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 15 కోట్ల కుటుంబాలకు తాగునీరందించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి వ్యవసాయ కూలీలు, చిరువ్యాపారులు, అసంఘటిత రంగంలోని వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3000 పింఛను ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు. రోదసీయాత్రకు సంబంధించిన ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టు దిశగా చర్యల్ని వేగవంతం చేసినట్లు మోదీ లేఖలో వివరించారు

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గింపు..

వ్యాపారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ‘వ్యాపారి కల్యాణ్‌ బోర్డు’ నెలకొల్పామని మోదీ గుర్తుచేశారు. స్వయం సహాయక సంఘాల్లో నమోదైన ఏడు కోట్ల మంది మహిళలకు రుణ సదుపాయం కల్పించామని తెలిపారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇటీవల ఒక్కో గ్రూపునకు రూ.20 లక్షల వరకు రుణాలిచ్చామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల కోసం 400 ‘ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల’ను ప్రారంభించామని తెలిపారు. ఇలా పలు కార్యక్రమాల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు తగ్గిపోతున్నాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని