అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయం!

అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3:22 గంటలకు మానవ సహిత ‘క్రూ డ్రాగన్‌’ క్యాప్సూల్‌ను......

Updated : 31 May 2020 09:36 IST

ఓ ప్రైవేటు వ్యోమనౌకలో మానవుల తొలి రోదసీయానం

వాషింగ్టన్‌: అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3:22 గంటలకు మానవ సహిత ‘క్రూ డ్రాగన్‌’ క్యాప్సూల్‌ను మోసుకెళ్లిన ఫాల్కన్‌-9 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ తన చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత అందులోని వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి చేరుకోనున్నారు.

వెళ్లింది వీరే..

అనేక చారిత్రక అంతరిక్షయానాలకు వేదికైన ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటరే మరో సరికొత్త చరిత్రకూ వేదికగా నిలిచింది. నాసాకు చెందిన బాబ్‌ బెహెంకెన్‌, డో హార్లీ అనే వ్యోమగాములను మోసుకెళ్తూ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాములను కక్ష్యలోకి పంపించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అక్కడే ఉన్న ఎక్స్‌పీడిషన్‌ 63 సభ్యులతో కలిసి వీరు నాలుగు నెలల పాటు పనిచేయనున్నారు. ఇంజిన్‌ను మండించడానికి ముందు ‘లెట్స్‌ లైట్ దిస్‌ క్యాండిల్‌’ అనే చారిత్రక పదాల్ని హార్లీ అనడం విశేషం. 1961లో అమెరికా తొలి మానవసహిత ప్రయోగ సమయంలో నాటి వ్యోమగామి అలెన్‌ షెపర్డ్‌ అన్న ఈ మాటల్నే తాజాగా హార్లీ వల్లెవేశారు. 

అమెరికా కల సాకారమైంది..

ఈ ప్రయోగంతో దాదాపు దశాబ్ద కాలంగా వేచిచూస్తున్న అమెరికా కల సైతం సాకారమైంది. 2011లో చివరిసారి అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఆ ప్రయోగంతో అమెరికా వ్యోమనౌక రిటైర్‌ కావడంతో నాటి నుంచి రష్యాకు చెందిన సూయజ్‌ అంతరిక్ష నౌకలోనే ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్నారు. దీనికోసం రష్యాకు అమెరికా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. చంద్రుడు, అంగారక గ్రహంపైకి వెళ్లే ప్రాజెక్టుల్లో నాసా తలమునకలై ఉంది. దీంతో ఐఎస్‌ఎస్‌ సహా ఇతర రోదసీయానాలకు అవసమయ్యే వ్యోమనౌకల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇందుకు ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌, మరో ప్రముఖ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చాయి. తాజాగా స్పేస్‌ఎక్స్‌ తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలుసార్లు స్పేస్‌ఎక్స్‌ నిర్మించిన డ్రాగన్‌ ఐఎస్‌ఎస్‌కు సరకులను మోసుకెళ్లిన అనుభవం ఉండడం గమనార్హం.

స్పేస్‌ఎక్స్‌కూ ఎంతో ప్రతిష్ఠాత్మకం..

భవిష్యత్తులో అంగారక గ్రహంపై జనావాసాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్న స్పేస్‌ఎక్స్‌ ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించింది. మనుషుల్ని మోసుకెళ్లడంలో తమ సామర్థ్యం నిరూపించేందుకు అవకాశంగా వినియోగించుకుంది. అలాగే, ‘స్పేస్‌ఎక్స్‌ డెమో-2’గా పేర్కొన్న ఈ మిషన్‌ విజయవంతం కావడంతో నాసాతో చేసుకున్న 2.6 బిలియన్‌ డాలర్ల ఒప్పందం ప్రకారం ఐఎస్ఎస్‌కు పంపే తమ ఆరు ఆపరేషనల్ మిషన్లను కొనసాగించేందుకు స్పేస్ఎక్స్‌కు మార్గం సుగమం కానుంది

 

స్పేస్‌ఎక్స్‌ లక్ష్యం నెరవేరిన వేళ.. మస్క్‌

ఈ ప్రయోగంతో స్పేస్‌ఎక్స్‌ కల సాకారమైందంటూ ఎలన్‌ మస్క్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంలో స్పేస్‌ఎక్స్‌, నాసా సహా ఇతర భాగస్వాముల కృషి ఎంతో ఉందని తెలిపారు. చాలా కాలం తర్వాత అమెరికా గడ్డపై నుంచి అమెరికా వ్యోమగాముల్ని రోదసీలోకి పంపడం ఆనందంగా ఉందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ జిమ్ బ్రిడెన్‌స్టైన్‌ అభిప్రాయపడ్డారు.

సంక్షోభంలో ఊరట..

వాస్తవానికి ఈ ప్రయోగం గత వారమే జరగాల్సి ఉంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికాకు ఈ ప్రయోగం కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా వైట్‌ హౌజ్‌ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌మస్క్‌ను ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రశంసించారు. ప్రయోగానికి ముందు వ్యోమగాములతో తాను మాట్లాడినట్లు అధ్యక్షుడు వెల్లడించారు.

ఇదీ చదవండి..
మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు