‘సమోసా’ కలిపింది ఇద్దర్నీ..! మోదీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఈ సమయంలో ఇంటికే పరిమితమైన సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కొత్త కొత్త వంటకాలతో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ కూడా భారత్‌లో అత్యంత ఎక్కువగా ఇష్టపడే సమోసా, మామిడి చట్నీని తయారు చేయడం విశేషం.

Published : 01 Jun 2020 00:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఈ సమయంలో ఇంటికే పరిమితమైన సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కొత్త కొత్త వంటకాలతో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ కూడా భారత్‌లో అత్యంత ఎక్కువగా ఇష్టపడే సమోసా, మామిడి చట్నీని తయారు చేయడం విశేషం. అంతేకాకుండా దీనికి ‘సండే స్కోమోసా విత్‌ మ్యాంగో చట్నీ’ అంటూ ట్విటర్‌లో షేర్‌ చేసి భారత ప్రధాని మోదీని ట్యాగ్‌ చేశారు. ‘చట్నీతోపాటు సమోసాలన్నీ పూర్తిగా తయారు చేసినవే..! ఈ వారం భారత ప్రధాని నరేంద్రమోదీతో వీడియో ద్వారా మాట్లాడాల్సి ఉంది. ఆ సమయంలో వాటి గురించి ప్రధానితో పంచుకోవాలని ఉంది’ అని ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని షేర్‌ చేసిన ట్వీట్‌కు తాజాగా నరేంద్ర మోదీ స్పందించారు. ‘హిందూ మహాసముద్రంతో కలపబడి.. భారతీయ సమోసాతో ఏకమయ్యాం’ అంటూ మోదీ ప్రతిస్పందించారు. ‘మీ వంటకం చూడడానికి రుచికరంగా ఉంది.. కొవిడ్‌ మహమ్మారిపై విజయం సాధించిన తర్వాత కలిసి సమోసాలను ఆస్వాదిద్దాం. జూన్‌ 4వ తేదీన జరిగే వీడియో సమావేశానికై వేచిచూస్తున్నా’నంటూ నరేంద్ర మోదీ రిప్లై ఇచ్చారు.

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌తో పాటు ఆస్ట్రేలియాలో కూడా ఉంది. ఈ సమయంలో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక చర్చల్లో భాగంగా ఇరు దేశ ప్రధానులు తొలిసారిగా వీడియో మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఈ సంవత్సరం జనవరిలోనే భారత్‌ పర్యటనకు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో ఏర్పడ్డ భారీ కార్చిచ్చు ప్రభావంతో అది మే నెలకు వాయిదా పడింది. అనంతరం కరోనా వైరస్‌ ప్రభావంతో తాజాగా ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించేందుకు ఇరుదేశాలు సన్నద్ధమయ్యాయి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని