లండన్‌ వీధుల్లో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని!

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు నిజంగానే ఆరోగ్యం బాగాలేదా? లేదా అనారోగ్యమంటూ అబద్ధాలు చెప్పి లండన్‌ చెక్కేశాడా? అనే విషయం ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశమయ్యింది.

Updated : 01 Jun 2020 14:05 IST

 నవాజ్ షరీఫ్‌ అనారోగ్య కారణాలపై అనుమానాలు..!

దిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు నిజంగానే ఆరోగ్యం బాగోలేదా? అనారోగ్యమంటూ అబద్ధాలు చెప్పి లండన్‌ చెక్కేశారా? అనే విషయం ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్‌ షరీఫ్‌ తాజాగా లండన్‌ వీధుల్లో తిరగడం పాకిస్థాన్‌లోనే ఆయనమీద విమర్శలకు కారణమయ్యింది.

పాకిస్థాన్‌కు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌(70) తాజాగా తన మనువరాళ్లతో కలిసి లండన్‌ వీధుల్లో కనిపించారు. నగరంలోని ఓ రోడ్డుపక్కన ఉన్న హోటల్‌లో టీ తాగుతూ కూర్చున్న ఫొటో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో సల్వార్‌ కమీజ్‌, నెత్తిన టోపీ పెట్టుకొని ఉన్న షరీఫ్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆ ఫొటో చూస్తే తెలుస్తోందని సోషల్‌ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా దీనిపై పాకిస్థాన్‌ ప్రభుత్వంలోని నాయకులే విమర్శలు మొదలు పెట్టారు. కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న లండన్‌ నగరంలో ముఖానికి మాస్క్‌ లేకుండానే దర్జాగా తిరుగుతున్న తీరు చూస్తుంటే ఆయన అనారోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు.

షరీఫ్‌ను అలా చూస్తుంటే మన దేశంలో(పాకిస్థాన్‌లో) చట్టం, న్యాయం, న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉందో బయటపెడుతోందని పాకిస్థాన్‌ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. దేశంలో వ్యవస్థ జవాబుదారీతనంపై ఎంతమందికి నమ్మకముందోనన్న విషయాన్ని ఈ ఫొటో స్పష్టం చేస్తోందన్నారు.

నవాజ్‌ షరీఫ్‌ కోర్టులో అబద్దాలు చెప్పి విదేశాలకు వెళ్లిపోయారని పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి సలహాదారు షహబాజ్‌ గిల్‌ ఆరోపించారు. పాకిస్థాన్‌ ప్రజలను నవాజ్‌ షరీఫ్‌ మూర్ఖులుగా భావిస్తున్నారని విమర్శించారు. వెంటనే పాకిస్థాన్‌కు వచ్చి ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యంగా ఉన్నాడంటూ తన మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని.. నిజంగా అలా ఉంటే పాకిస్థాన్‌కు ఎందుకు తిరిగి రావడంలేదని ప్రశ్నించారు.

నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం నవాజ్‌ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నవాజ్‌ షరీఫ్‌ను అవమానపరిచేందుకే ఉద్దేశపూర్వకంగానే కొందరు ఆయన ఫొటోలను విడుదల చేశారని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న షరీఫ్‌కు వైద్య పరీక్షల్లో తీవ్ర గుండె సంబంధ వ్యాధి అని తేలింది. దీంతో షరీఫ్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు విదేశాల్లో చికిత్స కోసం ప్రస్తుత పీటీఐ ప్రభుత్వం అనుమతించింది. అయితే లండన్‌లో కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా ఆయనకు జరగాల్సిన శస్త్రచికిత్స వాయిదా పడినట్లు షరీఫ్ కుమార్తె ప్రకటించారు.

ఇదిలా ఉంటే, నవాజ్‌ షరీఫ్‌ జైలులో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ కుటుంబ సభ్యులు పలుమార్లు ప్రకటించారు. మూత్రపిండాల వ్యాధి మూడో దశలో ఉందని, ఛాతినొప్పితో బాధపడుతున్నారని కోట్‌ లఖ్‌పాట్‌ జైలులో ఉన్న సమయంలో పేర్కొన్నారు. అయితే, అనారోగ్య కారణాలు చెప్పి లండన్‌ వెళ్లిన నవాజ్‌ షరీఫ్‌..ప్రస్తుతం అక్కడ స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతుండడంతో మరోసారి విమర్శలకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని