నిసర్గ: 150 మంది కరోనా పేషెంట్ల తరలింపు

అరేబియా సముద్రంలో ముంబయికి 690 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. మరింత తీవ్రరూపం దాల్చి మంగళవారం నాటికి తుపాను రూపం సంతరించుకోనున్నట్లు

Published : 02 Jun 2020 12:50 IST

ముంబయి: అరేబియా సముద్రంలో ముంబయికి 690 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. మరింత తీవ్రరూపం దాల్చి మంగళవారం నాటికి తుపాను రూపం సంతరించుకోనున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. దీన్ని ‘నిసర్గ’ తుపానుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు మహారాష్ట్రను కరోనా కేసులు వణికిస్తుంటే ఇప్పుడు నిసర్గ తుపాను ప్రభావం ఆ రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతోంది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎంఎంఆర్‌డీఏ(ముంబయి మెట్రోపాలిటన్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లను అక్కడి నుంచి తరలించారు. నిసర్గ తుపాను కారణంగా గంటకు 125కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఎంఎంఆర్డీఏలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను వర్లీకి పంపారు. 

‘ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా బాధితులను ఎంఎంఆర్డీఏ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడి కేంద్రంలో అన్ని చర్యలు తీసుకున్నా, తుపాను కారణంగా మేము రిస్క్‌ తీసుకోదలచుకోలేదు. జర్మన్‌ టెక్నాలజీతో నిర్మించిన ఈ టెంట్‌లు కేవలం 100కి.మీ. వేగంతో వీచే గాలులను మాత్రమే తట్టుకోగలవు. దీంతో ఇసుక బస్తాల సాయంతో టెంట్‌ స్తంభాలను మరింత బలోపేతం చేస్తున్నాం’’ అని ఎంఎంఆర్డీఏ కమిషనర్‌ ఆర్‌ఏ రాజీవ్‌ తెలిపారు.

మహారాష్ట్రకు నిసర్గ తుపాను ముప్పు పొంచి ఉన్న వేళ సోమవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. తుపాను వల్ల ఎక్కువ నష్టం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని