
వచ్చేవారం భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు
వెల్లడించిన వైట్ హౌస్
వాషింగ్టన్: భారత్‌కు విరాళంగా ఇస్తామన్న వెంటిలేటర్లలో కొన్నింటిని వచ్చేవారం పంపనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది. నిన్న జరిగిన ఫోన్ సంభాషణలో అధ్యక్షుడు ట్రంప్ ..ప్రధాని మోదీకి ఈ విషయం చెప్పినట్టు తెలిపింది. తొలి విడతలో భాగంగా దాదాపు 100 వెంటిలేటర్లు పంపనున్నట్లు పేర్కొంది. భారత్‌కు సహాయం చేసే అవకాశం రావడం పట్ల ట్రంప్ సంతోషంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతకుముందు జరిగిన ఫోన్ సంభాషణలో జి-7 కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపైనా చర్చించారు. అలాగే కొవిడ్-19 మహమ్మారి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపైనా మాట్లాడుకున్నారు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార నిరసనలపై ఆరా తీసిన మోదీ హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేశారు.
కొవిడ్ 19 చికిత్సలో కీలకంగా మారిన వెంటిలేటర్లను భారత్‌కు సరఫరా చేస్తామని ట్రంప్ రెండు వారాల క్రితమే హామీ ఇచ్చారు. అమెరికా స్పందన పట్ల మోదీ అప్పట్లోనే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ట్రంప్ అభ్యర్థన మేరకు కొవిడ్ 19 చికిత్స నిమిత్తం భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.