నిరసనలే అమెరికా బలం: బుష్‌

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనల పట్ల ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న విషాద వైఫల్యాలను సమీక్షించి సమన్యాయం కోసం సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.........

Updated : 03 Jun 2020 11:24 IST

వాటిని అణచివేయాలనుకునే వారికి అమెరికా అర్థమే తెలియదని వ్యాఖ్య

హ్యూస్టన్‌: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనల పట్ల ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న విషాద వైఫల్యాలను సమీక్షించి సమన్యాయం కోసం సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నిరసనలే తమ దేశ బలమని.. వాటిని అణచివేయాలనుకుంటున్నవారికి అమెరికా అంటే అర్థం తెలియదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా రిపబ్లికన్‌ పార్టీ సహచరుడు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆయన చురకలంటించారు. ఈ మేరకు బుష్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేశారు.  

సొంతదేశంలోనే ఆఫ్రికన్-అమెరికన్లపై దాడులు జరగడం అక్కడి వ్యవస్థల వైఫల్యమని బుష్‌ వ్యాఖ్యానించారు. వివిధ నేపథ్యాలున్న అమెరికా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం దేశం సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్య అని గుర్తుచేశారు. అమెరికా ఆదర్శాలను అవగాహన చేసుకోవడమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అని అభిప్రాయపడ్డారు.

అయితే, శాంతియుత నిరసనల ద్వారానే న్యాయం జరుగుతుందని బుష్‌ హితవు పలికారు. దోపిడీల వల్ల స్వేచ్ఛ, విధ్వంసం వల్ల ప్రగతి సాధ్యం కావని తాజా హింసాత్మక ఆందోళనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2009లో పదవి నుంచి దిగిపోయిన తర్వాత బుష్‌ సమకాలీన అంశాలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.

బుష్‌ ప్రకటన వెలువడిన కాసేపటికే ట్రంప్‌ ఓ ట్వీట్‌ చేశారు. అబ్రహం లింకన్‌ తర్వాత నల్లజాతీయుల సంక్షేమం కోసం తాను తీసుకున్న చర్యలు ఏ అధ్యక్షుడూ తీసుకోలేదని వ్యాఖ్యానించారు. తన హయాంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఏకరువు పెట్టారు.

ఇవీ చదవండి..

పౌరులపైకి సైన్యమా?
సైన్యాన్ని దించుతా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని