వీధుల్ని వదిలి ఇళ్లకు చేరండి: మెలనియా ట్రంప్‌

అమెరికాలో ప్రతిఒక్కరూ కర్ఫ్యూ నిబంధనల్ని పాటించాలని.. వీధుల్ని వదిలి ఇళ్లకు చేరాలని ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలనియా ట్రంప్‌ కోరారు. శాంతియుత పద్ధతిలో నిరసనల్ని వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు.......

Published : 04 Jun 2020 02:05 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రతిఒక్కరూ కర్ఫ్యూ నిబంధనల్ని పాటించాలని.. వీధుల్ని వదిలి ఇళ్లకు చేరాలని ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలనియా ట్రంప్‌ కోరారు. శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పౌరులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కలిసి కట్టుగా పనిచేస్తేనే అన్ని నగరాల్లోని ప్రజలకు భద్రత కల్పించగలమని పేర్కొన్నారు. అంతకుముందు ఫ్లాయిడ్‌ కుటుంబం పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం వైట్‌ హౌస్‌ సమీపంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో అధ్యక్షుడు ట్రంప్‌ సహా ఆయన కుటుంబం మొత్తం కాసేపు బంకర్‌లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.

మరోవైపు ఫ్లాయిడ్‌ సొంత నగరం హ్యూస్టన్‌లో వేలాది మంది ఆయన మృతికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ‘హాండ్స్‌ అప్‌-డోంట్‌ షూట్‌’, ‘నో జస్టిస్‌-నో పీస్‌’ వంటి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఫ్లాయిడ్‌ కుటుంబానికి చెందిన 16 మందితో పాటు దాదాపు 60 వేల మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నగర మేయర్‌ సిల్వస్టర్‌ టర్నర్‌ సహా పలువురు కాంగ్రెస్‌ సభ్యులు పాల్గొన్నారు. ‘‘ఫ్లాయిడ్‌కు చెడ్డపేరు తెచ్చే ఎలాంటి పనులు చేయకుండానే నిరసనల్ని కొనసాగిస్తాం. ఆయన మరణం వృథా కాలేదని నిరూపిస్తాం’’ అని ర్యాలీని ఉద్దేశిస్తూ టర్నర్‌ ప్రపంగించారు. ఫ్లాయిడ్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరు మాట్లాడుతూ..‘‘జార్జ్‌ కోసం ఇంతమంది కదిలివస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. న్యాయం జరిగే వరకు పోరాడతాం’’ అని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని