తీరాన్ని తాకిన నిసర్గ తుపాను‌

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను తీవ్ర తుపానుగా మారి ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లా అలీబాగ్‌ సమీపంలో తీరం.......

Updated : 03 Jun 2020 16:06 IST

ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను తీవ్ర తుపానుగా మారి ఈ రోజు మధ్యాహ్నం  తీరాన్ని తాకింది. మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లా అలీబాగ్‌ సమీపంలో తీరం దాటే ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తీరం దాటే సమయంలో 110-120 కి.మీ వేగంతో పెనుగాలు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో భారీ వర్షాలు కురిస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దించాయి.

* ముంబయిలో ఇప్పటికే 144 సెక్షన్‌ విధించారు. రెండు రోజుల పాటు ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ముంబయి విమానాశ్రయంలో ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించారు.  

* ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పుణెలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌, రత్నగిరి, పాల్‌ఘర్‌, సింధు దుర్గ్‌, థానే జిల్లాలపై అధిక ప్రభావం ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

* అనేక గ్రామాల నుంచి ప్రజలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గడ్‌ జిల్లాలో ఇప్పటికే 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్‌ నవసారి జిల్లాలోని 7 గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. సహాయక చర్యల నిమిత్తం విజయవాడ సహా ఇతర ప్రాంతాల నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మహారాష్ట్రకు తరలివెళ్లాయి.

* తుపాను నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ముంబయి తీరంలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. విపత్తును ఎదుర్కోవడం, సహాయక చర్యల నిమిత్తం పశ్చిమ నౌకాదళం కూడా ఏర్పాట్లు చేపట్టింది.

* గుజరాత్ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల నుంచి 78వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను ప్రభావం తక్కువే ఉందని అంచనా వేస్తున్నప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

* పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌‌ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విమానయాన సంస్థలు, పైలట్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

* మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే,, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం తరఫున అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర, గుజరాత్‌లకు తుపాను మరో ముప్పుగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని