ఆసియా, నల్లజాతీయులకే ఎక్కువ ప్రమాదం..!

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటోంది. అయితే, కరోనా తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్‌లో కొన్ని దేశాలకు చెందిన వారే ఎక్కువగా మరణిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన తెల్లజాతీయుల కంటే ఇతర అల్పసంఖ్యాక జాతీయులే ఎక్కువగా మరణిస్తున్నట్లు తాజాగా బ్రిటన్‌ ప్రజారోగ్య నివేదిక (పీహెచ్‌ఈ) వెల్లడించింది.

Updated : 03 Jun 2020 15:31 IST

యూకేలో కొవిడ్‌ సోకి 746మంది భారతీయులు మృతి
బ్రిటన్‌ ప్రజారోగ్య నివేదిక వెల్లడి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటోంది. అయితే, కరోనా తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్‌లో కొన్ని దేశాలకు చెందిన వారే ఎక్కువగా మరణిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన తెల్లజాతీయుల కంటే ఇతర అల్పసంఖ్యాక జాతీయులే ఎక్కువగా మరణిస్తున్నట్లు తాజాగా బ్రిటన్‌ ప్రజారోగ్య నివేదిక (పీహెచ్‌ఈ) వెల్లడించింది. గత సంవత్సర నివేదికలో మాత్రం మారణాల రేటు తెల్లజాతీయుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పీహెచ్‌ఈ పేర్కొంది. కొవిడ్‌-19 విజృంభిస్తోన్న తరుణంలో బ్రిటిన్‌ ప్రజలతో పోలిస్తే ఆసియా, నల్లజాతీయులే కొవిడ్‌ కారణంగా మరణించడం తాజాగా చర్చకు దారితీసింది.

బ్రిటన్‌ దేశీయులతో పోలిస్తే బంగ్లాదేశీయులు రెట్టింపు స్థాయిలో మరణిస్తున్నట్లు ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య నివేదిక గుర్తించింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ బారినపడుతున్న భారత్‌, చైనా, పాకిస్థాన్‌, కరేబియన్‌ ఇతర ఆసియా దేశాలతో పాటు ఇతర అల్పసంఖ్యాక (నల్ల జాతీయులు) ప్రజలు 10నుంచి 50శాతం అధికంగా మరణిస్తున్నట్లు తేల్చింది. ఇప్పటి వరకు బ్రిటన్‌లో 22,880 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో 746 మంది భారతీయులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 483మంది పాకిస్థానీయులు, 182మంది బంగ్లాదేశస్థులు, 713మంది కరేబియన్‌లతోపాటు 430మంది ఆఫ్రికన్లు కరోనా సోకి మరణించారని తెలిపింది.

యూకే ఆసుపత్రుల్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న దాదాపు పదివేల మంది కొవిడ్‌-19 రోగులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఈ సమయంలో రోగుల వయసు, లింగము, ఊబకాయంతోపాటు ఇతర వ్యాధలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. అయితే వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పనిచేయడం, జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్రదేశాలు, వెనుకబడిన ప్రాంతాల్లో జీవించడం, పట్టణప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం, వీరి కుటుంబాల్లో ఎక్కువ మంది నివసించడం వల్లే వీరు వైరస్‌కు బలయ్యే అవకాశాలు తీవ్రంగా ఉన్నట్లు ఈ నివేదిక ప్రాథమికంగా విశ్లేషించింది.

‘మన దేశంలో ఆరోగ్య అసమానతలు ఉన్నట్లు ఈ నివేదిక తెలుపుతోంది. దీనివల్ల కొందరికి అన్యాయం జరుగుతుందనే భావన అల్పసంఖ్యాక ప్రజలు ఆక్రోశించే ప్రమాదం ఉంది’ అని బ్రిటన్‌ ఆరోగ్య కార్యదర్శి మాట్‌ హాంకాక్‌‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జాతీ అసమానతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ నివేదిక వచ్చింది. అయితే, కేవలం నల్లజాతీయులు, అల్ప సంఖ్యాకులకే ఎక్కువ ప్రమాదం పొంచివుందన్న భావవ మాత్రం చర్చనీయాంశం కాదని బ్రిటన్‌ ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ఈ అసమానతలకు గల కారణాలను విశ్లేషించడంతోపాటు ఆ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు చేయాల్సిన కృషిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వెనకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న ఇతర దేశస్థుల ప్రాణాలు కూడా ఎంతో ముఖ్యమైనవవి మాట్‌ హ్యాన్‌కాక్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని