దేశాధ్యక్షుడు క్షమాపణ చెప్పాలి- కోర్టు..!

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ ఆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాజాగా అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. పపౌ రీజియన్‌లో నెలకొన్న అశాంతియుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధిస్తూ జోకో విడొడొ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్దమైందని ప్రకటించింది.

Published : 04 Jun 2020 02:04 IST

ఇండోనేషియా అధ్యక్షుడికి అక్కడి కోర్టు ఆదేశం..

జకర్తా: ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ ఆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాజాగా అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. పపౌ రీజియన్‌లో నెలకొన్న అశాంతియుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధిస్తూ జోకో విడొడొ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమైందని ప్రకటించింది.

తొలుత జావా ద్వీపంలోని సురబయ ప్రాంతంలో ఉన్న విద్యార్థులపై కొందరు జాత్యాహంకార దూషణలు చేయడంతో అల్లర్లకు ఆజ్యం పోసింది. దీనిపై గత సంవత్సరం ఆగస్టులో ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అక్కడ నుంచి ఈ నిరసన జ్వాలలు ఇండోనేషియాలోని పలు పట్టణాలకు వ్యాపించాయి. దీంతో పపౌ ప్రావిన్సుతోపాటు పడమటి పపౌలలో అశాంతి వాతావరణం నెలకొంది. ఈ హింసాత్మక సంఘటనలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో వదంతులను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది.

దీంతో ఇండోనేషియా అలయన్స్‌ ఆఫ్ ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌(ఏజేఐ) తోపాటు మరికొన్ని మీడియా సంస్థలు జకర్తా అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టును ఆశ్రయించాయి. అధ్యక్షుడి నిర్ణయంతో మీడియా స్వేచ్ఛకు భంగం కలగడంతోపాటు మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ కోర్టుకు విన్నవించాయి. కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగించిన విషయంలో మీడియా సంస్థలకు, ప్రజలకు ఇండోనేషియా అధ్యక్షుడితోపాటు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. తీర్పు ఇచ్చిన అనంతరం నెలరోజుల్లోపు మూడు జాతీయ పత్రికలతోపాటు ఆరు టెలివిజన్‌లలో క్షమాపణ ప్రకటన ఇవ్వాలని తెలిపింది. ఈ సమయంలో అప్పీలుకు వెళ్లేందుకు ప్రభుత్వానికి 14రోజుల గడువు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని