ట్రంప్‌-మోదీ సంభాషణతో ఉలిక్కిపడ్డ చైనా!

భారత్‌-చైనా దేశాల సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని చైనా మరోసారి స్పష్టంచేసింది. వీటిని చక్కబరుచుకునేందుకు కావాల్సిన విధానాలు ఇరుదేశాలకు ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝవో లిజియన్ ప్రకటించారు

Published : 03 Jun 2020 18:46 IST

మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని ప్రకటన

బీజింగ్‌: భారత్‌-చైనాల సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. వీటిని చక్కబెట్టుకునేందుకు కావాల్సిన విధానాలు ఇరుదేశాలకు ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝవో లిజియన్ ప్రకటించారు. భారత్‌లో సరిహద్దు విషయంలో చైనా స్పష్టమైన వైఖరి కలిగి ఉందని.. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొవిడ్‌-19, భారత సరిహద్దుల్లో పరిస్థితులు, తదితర విషయాలపై ఫోన్‌లో సంభాషించుకున్న నేపథ్యంలో చైనా ఈవిధంగా స్పందించింది.

‘ప్రస్తుతం భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. సరిహద్దుకు సంబంధించి ఇరు దేశాలు కూడా స్పష్టమైన విధానం, సమాచార వ్యవస్థ కూడా కలిగి ఉన్నాయి. సంప్రదింపులు, చర్యల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే సామర్థ్యం ఇరుదేశాలకు ఉంది. ఈ సమయంలో థర్డ్‌ పార్టీ జోక్యం అవసరం లేదు’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

చైనా, భారత్‌ మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానని ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలసిందే. ట్రంప్‌ ప్రతిపాదనను ఇరుదేశాలు సున్నితంగా తిరస్కరించాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో కొవిడ్‌ తీవ్రత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సంభాషించడం, జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించడం తదితర వరుస ఘటనల నేపథ్యంలో ఉలిక్కిపడ్డ చైనా ప్రతిస్పందించే ప్రయత్నం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని