దేశంలో రక్షణశాఖ ఉన్నతాధికారికి కరోనా

దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి, తొలిసారిగా ఓ ఉన్నతాధికారికి సోకింది.

Updated : 04 Jun 2020 11:00 IST

రైసినా హిల్స్‌లో కొవిడ్‌ 19 కలకలం

దిల్లీ: దిల్లీలోని రక్షణ శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్‌ సోకింది. ఆయన ఇప్పటి వరకూ కొవిడ్‌-19 కట్టడి విధుల్లోనే ఉన్నట్టు సమాచారం. ఈ అధికారి జూన్‌ 1 తేదీ వరకు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ... కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేస్తున్నారు. తేలికపాటి జ్వరం తదితర లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలో కరోనా సోకిన విషయం వెల్లడైంది. కాగా, కొవిడ్‌-19 సోకిన ఉన్నతాధికారుల్లో ఈయనే తొలి వ్యక్తి కావటం గమనార్హం.

ఆయన విధులు నిర్వహిస్తున్న  సౌత్‌ బ్లాక్‌ను మూసివేశారు. ఈ విషయం తెలిసి సౌత్‌ బ్లాక్‌లోని పలువురు రక్షణశాఖ ఉన్నతాధికారులు విధులకు హాజరు కాలేదు. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా తన కార్యాలయానికి రాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. బాధిత అధికారితో గత రెండు రోజుల్లో 30 మంది వ్యక్తులు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈయన విధులు నిర్వహిస్తున్న సౌత్‌ బ్లాక్‌ మొదటి అంతస్తులోనే రక్షణ మంత్రి, సైన్యాధ్యక్షుడు, నావికా దళాధిపతుల కార్యాలయాలు ఉన్నాయి. కాగా, ఈ విషయాన్ని గంభీరంగా పరిగణిస్తున్నామని...  పూర్తి భవనంలో శానిటైజేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని