దిల్లీ ఎయిమ్స్‌లో 480మంది సిబ్బందికి కరోనా

దేశ రాజధాని దిల్లీలో వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉండి రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది....

Published : 05 Jun 2020 02:09 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనాపై పోరులో ముందు వరుసలో నిలబడి రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో 480 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 19 మంది వైద్యులు, 38 మంది నర్సులు, 74 మంది సెక్యూరిటీ గార్డులు, 75 మంది ఆస్పత్రి అటెండర్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది, 14 మంది లేబొరేటరి టెక్నీషియన్లు కాగా, మిగిలిన వారు ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులని ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. అలానే ముగ్గురు ఎయిమ్స్‌ సిబ్బంది కరోనా కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. వీరిలో ఒకరు ఎయిమ్స్‌ శానిటేషన్ విభాగంలో ఉన్నతాధికారి, మరొకరు ఆస్పత్రి మెస్‌లో పనిచేసే ఉద్యోగి. 

గత మూడు రోజులుగా ఎయిమ్స్‌ నర్సుల సంఘం ఆస్పత్రిలో తాము పనిచేసే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు తమకు అందించే పీపీఈ కిట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని ప్రధానంగా ఆరోపించారు. కరోనా నియంత్రణలో భాగంగా మార్చి నెలలో తొలి సారిగా ఎయిమ్స్‌ బయటి రోగులకు అందించే వైద్య సేవలను నిలిపివేసింది. ఆస్పత్రిలోని ట్రామా కేంద్రాన్ని పూర్తి స్థాయి కరోనా వార్డుగా మార్చి రోగులకు సేవలందిస్తున్నారు. దేశం మొత్తం మీద కరోనా కేసుల నమోదులో దిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు దిల్లీలో 23,645 కరోనా కేసులు నమోదుకాగా, వారిలో 9542 మంది వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అలానే 606 మంది మృతిచెందారు. 13,497 మంది చికిత్స‌ పొందుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని