అమెరికా.. నిరసనలతో మరింత ముప్పు!

అమెరికా పోలీసుల కస్టడీలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి అనంతరం వ్యక్తమైన ఆందోళనలు, నిరసనలు ఇప్పటికీ హోరెత్తుతూనే ఉన్నాయి. ..

Published : 05 Jun 2020 14:28 IST

వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని నిపుణుల హెచ్చరిక
కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని నిరసనకారులకు సూచన

న్యూయార్క్‌: అమెరికా పోలీసుల కస్టడీలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి అనంతరం వ్యక్తమైన ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో అతలాకుతలమౌతున్న అమెరికాకు ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు మరింత ముప్పు కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేయడంలో తంటాలు పడుతున్న నగరాల్లో నిరసనల వల్ల వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) హెచ్చరించింది.

ముఖ్యంగా వాషింగ్టన్‌ డీసీ, మినియాపొలిస్‌, న్యూయార్క్‌తోపాటు నిరసనలు ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో వైరస్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సీడీసీ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ ప్రకటించారు. ఈ సమయంలో నిరసనకారులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇలాంటి నిరనసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వారు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా తగు చర్యలు చేపట్టాలని అమెరికా ప్రభుత్వ నేతృత్వంలోని ఓ సబ్‌కమిటీకి సీడీసీ డైరెక్టర్‌ నివేదించారు.

‘ఫ్లాయిడ్‌కు మద్దతుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా కేవలం న్యూయార్క్‌ రాష్ట్రంలోనే దాదాపు 30వేల మంది నిరసనకారులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది మాస్కులు ధరించినప్పటికీ, భౌతిక దూరాన్ని మాత్రం పాటించలేదు. దీంతో వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. అందుచేత నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారు దయచేసి వైద్య పరీక్షలు చేయించుకోండి’ అని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్ర్యూ క్యూమో ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని బఫలో, అల్బనీ, రోచెస్టర్‌, సైరాక్యూజ్‌ పట్టణాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయని  ఆండ్ర్యూ క్యూమో వెల్లడించారు. కరోనా వైరస్‌తో కుదేలైన న్యూయార్క్‌ నగరం సోమవారం నుంచి తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో తాజాగా నెలకొంటున్న పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

తాజాగా షికాగో అధికారులు కూడా వైరస్‌ వ్యాప్తిపై ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నవారు 14రోజులు స్వతహాగా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇలా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వీధుల్లో నిరసనలు జరుగుతున్న సమయంలో వైరస్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వంతోపాటు అక్కడి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు అదుపులోకి రాకుంటే సైన్యాన్ని రంగంలోకి దింపుతామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 19లక్షల మంది కరోనా వైరస్‌ బారినపడగా వీరిలో దాదాపు లక్షా 10వేల మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..
అమెరికాలో.. గాంధీ విగ్రహం అపవిత్రం
భారత్‌లో.. ఒకేరోజు 9851కేసులు, 273మరణాలు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని