
ఆయుష్మాన్ భారత్ కింద కొవిడ్ చికిత్స చేయగలరా?
ప్రైవేట్ ఆస్పత్రులను వివరణ కోరిన సుప్రీంకోర్టు
దిల్లీ: కొవిడ్-19 రోగులకు కేంద్ర ప్రభుత్వ పథకం ‘ఆయుష్మాన్ భారత్’ కింద ఇచ్చే చార్జీలతో చికిత్స అందించగలరో.. లేదో.. తెలియజేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల్ని సుప్రీం కోర్టు కోరింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఉచితంగా కొవిడ్ చికిత్స అందించాల్సిన అవసరం లేదని తెలిపింది. కేవలం ప్రభుత్వ రాయితీ కింద స్థలం పొందిన ఆస్పత్రులు కనీసం కొంతమంది రోగులకైనా చికిత్స అందజేయాలని మాత్రమే కోర్టు కోరుతోందని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తిరిగి ఈ అంశాన్ని కోర్టు రెండు వారాల తర్వాత విచారించనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.