
20మంది దిల్లీ మెట్రో సిబ్బందికి కరోనా
దిల్లీ: దిల్లీ మెట్రోలో పనిచేసే 20మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడినట్లు డీఎంఆర్సీ(దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) గురువారం ట్విటర్లో పేర్కొంది. ప్రస్తుతం వారందరూ కోలుకుంటున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. వైరస్ సోకిన మెట్రో ఉద్యోగులంతా దిల్లీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారే.
దేశరాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ, రైల్వే, మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రజారవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన వెంటనే తిరిగి మెట్రో సేవలు ప్రారంభించేందుకు దిల్లీ మెట్రో సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
‘‘దేశం మొత్తం కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో దిల్లీ మెట్రో కూడా భాగస్వామ్యమైంది. మెట్రోరైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభం కానున్న తరుణంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నారు.’’ అని దిల్లీ మెట్రో తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. దీంతో పాటు మాస్కు, గ్లౌజ్‌లు ధరించిన మెట్రో ఉద్యోగి పోస్టర్‌ను ట్విటర్లో పోస్టు చేసింది.
Advertisement