జాత్యహంకారంపై గళం విప్పిన ప్రపంచం

శ్వేతజాతి పోలీసుల దురహంకారానికి వ్యతిరేకంగా అగ్రరాజ్యం అమెరికాలో జరగుతున్న నిరసనలు వారాంతంలో తారస్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపై చేరి జాత్యహంకారాన్ని తుదముట్టించాలని నిరసించారు.......

Updated : 07 Jun 2020 10:12 IST

ప్రపంచ నగరాల్లో కొనసాగిన నిరసనలు
వారాంతం కావడంతో అమెరికాలో తారస్థాయికి

వాషింగ్టన్‌: శ్వేతజాతి పోలీసుల దురహంకారానికి వ్యతిరేకంగా అగ్రరాజ్యం అమెరికాలో జరగుతున్న నిరసనలు వారాంతంలో తారస్థాయికి చేరినప్పటికీ శాంతియుతంగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపై చేరి జాత్యహంకారాన్ని తుదముట్టించాలని నిరసించారు. అటు ప్రపంచవ్యాప్తంగానూ అనేక నగరాల్లో జాతిసమానత్వానికి మద్దతుగా కదం తొక్కారు. కొన్ని రోజుల కిందట హింసాత్మక ధోరణిలో సాగి ఏకంగా అగ్రరాజ్యాధిపతి ట్రంప్‌ని సైతం కలవరానికి గురి చేసిన ఈ నిరసనలు క్రమంగా శాంతిరూపం సంతరించుకున్నాయి. లండన్‌ మినహా ఎక్కడా తీవ్రస్థాయి ఘర్షణలకు తావివ్వకుండా పోలీసుల చేతుల్లో బలైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ త్యాగానికి అర్థం చేకూర్చేందుకు కంకణబద్దులయ్యారు. 

* వాషింగ్టన్‌, న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌, మినియాపొలిస్‌, లాస్‌ ఏంజిలెస్‌ సహా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించారు. ‘జస్టిస్‌ ఫర్‌ ఫ్లాయిడ్‌’, ‘నో జస్టిస్‌ నో పీస్‌’, ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ వంటి నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. రాజధాని వాషింగ్టన్‌లో కొన్ని ప్రధాన వీధుల్ని ముసివేశారు. కానీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. శాంతియుతంగానే నిరసనలు కొనసాగాయి.

* న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ముందు నిరసనకారులు భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అమెరికాలో జరుగుతున్న నల్లజాతీయులపై జరుగుతున్న నిరసనలకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.

* అటు ఐరోపాలోనూ అనేక దేశాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట దాదాపు 5,500 మంది ఆందోళనకు దిగారు. మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిసి దాదాపు 23,000 మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు అక్కడి మంత్రి తెలిపారు. స్విట్జర్లాండ్‌లోనూ ప్రజలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో దాదాపు 15,000 మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. నల్ల దుస్తులు ధరించి ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. 

* బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మాత్రం స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23 మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. గత వారం రోజులుగా శాంతియుత మార్గంలోనే ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. శనివారం కొంతమంది ఆకతాయిలు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో ఘర్షణ తలెత్తింది. అయినా, పోలీసులు సంయమనం పాటించి గొడవను పెద్దది చేయకుండా చూశారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాల్లో జనం గుమిగూడడంపై నిషేధం ఉన్నా ప్రజలు పట్టించుకోలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతూనే ఉందంటూ నినదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని