‘సరిహద్దులో శాంతి ఇరు దేశాలకు ప్రయోజనం’

భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గతంలో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు....

Published : 07 Jun 2020 12:50 IST

చర్చలు కొనసాగించాలని భారత్‌-చైనా నిర్ణయం

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. గతంలో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, నాయకుల మధ్య జరిగిన చర్చల ఫలితాల ఆధారంగా ఓ పరిష్కార మార్గానికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. లద్దాఖ్‌ సమీప వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే విషయమై శనివారం ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారులు భేటీ అయిన విషయం తెలిసిందే. తూర్పు లద్దాఖ్‌లోని చైనా వైపు మాల్దోలో ఉన్న సరిహద్దు సిబ్బంది సమావేశ ప్రాంతంలో ఈ భేటీ జరిగింది. భారత బృందానికి లేహ్‌లో ఉన్న 14 కోర్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హరిందర్‌ సింగ్‌, చైనా బృందానికి టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ నేతృత్వం వహించారు. 

సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డట్లు విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధం ఏర్పడి ఈ ఏడాదితో 70 వసంతాలు నిండనున్నాయని గుర్తుచేసినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో వివాదాల పరిష్కారం ఉభయ దేశాల ప్రయోజనాలకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డట్లు తెలిపింది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాలని అవగాహనకు వచ్చినట్లు పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని