‘మిస్టరీ’ వాసనతో ముంబయి ఉక్కిరిబిక్కిరి!

ఇప్పటికే కరోనా మహమ్మారితో వణికిపోతున్న ముంబయి నగరానికి నిన్న రాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన వెంటాడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో చెడు వాసన వస్తోందంటూ శనివారం సాయంత్రం నుంచి ముంబయి నగరపాలక సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి.

Published : 08 Jun 2020 01:32 IST

గ్యాస్‌ లీక్‌ కాదన్న నగర కార్పొరేషన్ 

ముంబయి: ఇప్పటికే కరోనా మహమ్మారితో వణికిపోతున్న ముంబయి నగరానికి నిన్న రాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన వెంటాడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో చెడు వాసన వస్తోందంటూ శనివారం సాయంత్రం నుంచి ముంబయి నగరపాలక సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా చెంబూర్‌, ఘాట్కోపర్‌, అంధేరీ, కంజూర్‌మార్గ్‌, విఖ్రోలీ తదితర ప్రాంతాల్లో ఈ ఘాటు వాసన వస్తోందంటూ ప్రజలు ఆందోళన చెందారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్‌ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలుత గ్యాస్‌ లీక్‌గా భావించాయి. దాదాపు 17 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో వాసనకు మూలాలు కనుక్కునేందుకు ప్రయత్నించాయి. వీటితోపాటు ప్రమాదకర రసాయనాలను పసిగట్టి నియంత్రించే హజ్‌మత్‌ వాహనాన్ని కూడా రంగంలోకి దించి ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా సమీప ప్రాంతాల్లోని రసాయన పరిశ్రమలను పరిశీలించారు. పెట్రోలియం కార్పొరేషన్లను, గ్యాస్‌ కంపెనీలను కూడా అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఎక్కడ కూడా చెడు వాసనకు సంబంధించి గ్యాస్‌ లీకేజీ కావట్లేదని తేల్చారు.

ఆదివారం ఉదయానికీ వాసన మూలాలు కనిపెట్టలేకపోయిన బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ తాజాగా ఇది గ్యాస్‌ లీక్‌ కాదని మాత్రం ప్రకటించింది. దీనికిగల కారణాలపై శోధిస్తునట్లు వెల్లడించింది. ఈ సమయంలో పరిస్థితి అదుపులోనే ఉందని.. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని మంత్రి ఆధిత్య ఠాక్రే ప్రజలకు సూచించారు. గత సంవత్సరం కూడా ఇదే తరహా వాసనతో ముంబయిలోని పలు ప్రాంతవాసులు ఇబ్బంది పడ్డారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని