సరిహద్దులో చైనా సైనిక విన్యాసాలు!

తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న వివాదానికి పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలు జరిపిన మరుసటి రోజే చైనా వేలాది మంది సైనికులతో సరిహద్దు వద్ద డ్రిల్‌ నిర్వహించినట్లు సమాచారం. సెంట్రల్‌ చైనీస్‌ ప్రావిన్సు......

Published : 08 Jun 2020 12:17 IST

శాంతి చర్చలు జరుపుతూనే ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్న డ్రాగన్‌

బీజింగ్‌: తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న వివాదానికి పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలు జరిపిన మరుసటి రోజే చైనా వేలాది మంది సైనికులతో సరిహద్దు వద్ద డ్రిల్‌ నిర్వహించినట్లు సమాచారం. సెంట్రల్‌ చైనీస్‌ ప్రావిన్సు నుంచి సరిహద్దుకు తమ బలగాల్ని, యుద్ధ వాహనాల్ని తరలించడంపై తమ సన్నద్ధతను పరీక్షించుకోవడానికే ఈ చర్యలకు దిగినట్లు సమాచారం. భారత్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలో ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’(పీఎల్‌ఏ) ఈ విన్యాసాలు నిర్వహించినట్లు చైనాకు చెందిన పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది. గతవారం కూడా పత్రిక ఈ తరహా కథనాన్ని ప్రచురించింది. టిబెట్‌ మిలిటరీ కమాండ్‌కు చెందిన సైనికులు సముద్ర మట్టానికి 4,700 మీటర్ల అతిఎత్తైన ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించినట్లు పేర్కొంది. ఓవైపు సమస్య పరిష్కారం దిశగా శాంతియుత చర్చలు జరిపేందుకు అంగీకరిస్తూనే.. మరోవైపు ఈ తరహా సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తుండటం చైనా ద్వంద్వ నీతిని బహిర్గతం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనను త్వరగా పరిష్కరించుకునే దిశగా సైనిక, దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు తీర్మానించిన విషయం తెలిసిందే. శనివారం  భారత్‌, చైనా సైనికాధికారుల భేటీలో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనను త్వరగా పరిష్కరించుకుంటే ఇరుదేశాల సంబంధాల్లో మరింత పురోగతి సాధ్యమవుతుందని భారత్‌, చైనాలు అభిప్రాయపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని