బడిగంట కొట్టేది అప్పుడేనా?

విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్‌ ప్రకటించారు.

Published : 09 Jun 2020 02:01 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్‌ ప్రకటించారు. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హోంశాఖ అనుమతించిన మీదటే నూతన విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్‌-19 పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన అనంతరం మాత్రమే.. ఈ అంశంపై నిర్ణయం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలలో బోధన కూడా ఆగస్టు తర్వాతనే మొదలుపెడతామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం 10, 11, 12వ తరగతి విద్యార్థులకు మిగిలిన పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని.. పాఠశాలలు తెరిచే విషయమై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలను ఆగస్టు 15లోగా వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. పరీక్షా ఫలితాల అనంతరం మాత్రమే పాఠశాలలు, కళాశాలలు తెరిచే ప్రక్రియ మొదలు మొదలవుతుందని ఆయన వివరించారు. కొత్త విద్యా సంవత్సరంలో సీట్ల అమరిక, పాఠశాల సమయాలలో మార్పు, తరగతులను వివిధ సెక్షన్లుగా విభజించటం వంటి నిర్ణయాలను మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ ఇటీవల మార్గదర్శకాల్లో వెలువరించారు.

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్త విద్యాసంస్థలు మార్చి 23 నుంచి నిరవధికంగా మూతపడిన సంగతి తెలిసిందే. అనేక ప్రైవేటు పాఠశాలలు కూడా పాఠశాలలు తెరవడం, అందుకు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని