చైనా దాచిపెట్టినా ‘పైవాడు’ బయటపెట్టాడు

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంటున్న కరోనా మహమ్మారిపై చైనా వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది.

Published : 09 Jun 2020 17:17 IST

చైనాలో కరోనా వ్యాప్తి ఆగస్టులోనే!

లండన్: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంటున్న కరోనా మహమ్మారిపై చైనా వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. వైరస్‌ గురించి సరైన సమాచారం ఇవ్వకపోగా, కనీసం ప్రపంచ దేశాలను అప్రమత్తం కూడా చేయలేదని అగ్రరాజ్యంతో సహా చాలా దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నిందలు తప్పించుకోవడం కోసం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో.. డిసెంబరు 27న వుహాన్‌లో వైరస్‌ను గుర్తించామని, జనవరి 19న ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నట్లు కనుగొన్నామని తప్పును కప్పిపుచ్చుకునే  ప్రయత్నం చేసింది. అయితే తాజాగా వెలువరించిన హార్వర్డ్ పరిశోధనలో మాత్రం గత ఏడాది ఆగస్టులోనే కరోనా వైరస్‌ చైనాలో వ్యాప్తి చెంది ఉండొచ్చని వెల్లడవుతోంది. శాటిలైట్ దృశ్యాల్లో ప్రజలు ఆసుపత్రులకు వరస కట్టిన తీరు కనిపించిందని, సెర్చ్‌ఇంజిన్‌లో దగ్గు, అతిసారానికి సంబంధించిన సమాచారం కోసం ప్రజలు వెతికినట్లు తెలిసిందని పరిశోధకులు వెల్లడించారు. 

‘ఆసుపత్రులకు జనాలు వరుసకట్టిన తీరు, రోగలక్షణాల గురించి శోధించడాన్ని బట్టి చూస్తే  డిసెంబరులో సార్స్‌-కొవ్-2 సమాచారాన్ని డాక్యుమెంట్ చేయడానికి ముందే వూహాన్‌లో వైరస్ వ్యాప్తి ఉందని తెలుస్తోంది. ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య పెరగడానికి ఈ వైరస్‌ వ్యాప్తితో ప్రత్యక్ష సంబంధం ఉందని ధ్రువీకరించలేం. అయితే సీఫుడ్ మార్కెట్‌ నుంచి వైరస్ విజృంభణకు ముందే దాని ఆవిర్భావం ఉందని ఇటీవలి పరిశోధనకు మా ఆధారాలు బలం చేకూర్చుతున్నాయి’ అని వారు వెల్లడించారు. దక్షిణ చైనాలో వైరస్ సహజంగానే ఆవిర్భవించిందని, వూహాన్‌లో అప్పటికే వ్యాపించిందని ప్రచారంలో ఉన్న ఓ వాదనకు తాము కనుగొన్న అంశాలు దగ్గరగా ఉన్నాయిని వారు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అతిసారం, దగ్గుకు సంబంధించిన సమాచారం కోసం శోధనలు ఎక్కువగా నమోదైనట్లు గుర్తించామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని