భారత దళాలపై అదృశ్య నేత్రం..!

భారత్‌ తురుపు ముక్క బ్రహ్మోస్‌ రహస్యాలు 2018లో పాక్‌ చేతికి చిక్కడానికి కారణం ఓ యువ ఇంజినీరు నిర్లక్ష్యం. అప్పట్లో ఆ ఇంజినీరు తన ప్రొఫైల్‌ను సోషల్‌ మీడియాలో పెట్టాడు. అది పాక్‌ గూఢచారుల దృష్టికి వచ్చింది. అంతే అతన్ని ఫేస్‌బుక్‌లో గుర్తించి ఇద్దరు అమ్మాయిల పేర్లతో వలపు ఉచ్చులోకిదించి రహస్యాలను రాబట్టారు.

Updated : 10 Jun 2020 12:49 IST

 ఏమరపాటుతో కీలకసమాచారం శత్రువు చేతికి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ తురుపు ముక్క బ్రహ్మోస్‌ రహస్యాలు 2018లో పాక్‌ చేతికి చిక్కడానికి కారణం ఓ యువ ఇంజినీరు నిర్లక్ష్యం. అప్పట్లో ఆ ఇంజినీరు తన ప్రొఫైల్‌ను సోషల్‌ మీడియాలో పెట్టాడు. అది పాక్‌ గూఢచారుల దృష్టికి వచ్చింది. అంతే అతన్ని ఫేస్‌బుక్‌లో గుర్తించి ఇద్దరు అమ్మాయిల పేర్లతో వలపు ఉచ్చులోకి లాగారు. రహస్యాలను రాబట్టారు. తాజాగా ఓ భారత అధికారి చిరునామా మారడాన్ని ఆధారంగా చేసుకుని అగ్ని క్షిపణులను ఎక్కడ మోహరించిందో అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఈ ఘటన జాతీయ భద్రతపై  ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అధికారుల ఒక చిన్న ఏమరపాటు దేశరహస్యాలను ప్రత్యర్థుల చేతికి చిక్కేట్లు చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ.

చైనాతో వివాద సమయంలో కూడా..

లద్దాఖ్‌ ప్రాంతంలో చైనాతో వివాదం జరుగుతున్న సమయంలో కూడా భారత్‌ దళాలకు సంబంధించిన కదలికలు ఓపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో గుర్తించి సోషల్‌ మీడియాలో ఉంచారు. ‘DetResFa’ అనే ట్విటర్‌ ఖాతాలో చాలా స్పష్టమైన వీడియోలను ఉంచడం గమనార్హం. అదే సమయంలో చైనా దళాల కదలికల సమాచారం కూడా వీటిల్లో ఉంది. గతంలో బాలాకోట్‌ దాడుల సమయంలో కూడా భారత విమానాల కదలికలకు సంబంధించిన కీలక సమాచారం బహిర్గతమైంది. www.flightradar24.com వంటి వెబ్‌సైట్లలో విమానాల కదలికలకు సంబంధించిన సమాచారం లభిస్తోంది. దీంతో వాటి కదలికలను గుర్తించడం తేలికవుతోంది.

ఏమిటీ ఓపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌..

పబ్లిక్‌ డొమైన్‌లో తేలిగ్గా లభించే సమాచారాన్ని సేకరించి విశ్లేషించి కీలకమైన విషయాలను రాబట్టడాన్ని ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ అంటారు. దీనికి ప్రధానంగా మీడియాలో వచ్చే వీడియో క్లిప్‌, ఫొటోలు, ప్రభుత్వ రంగ వెబ్‌సైట్లలో పెట్టే ఫొటోలు, యూట్యూబ్‌ వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టింగ్‌లు, వికీపీడియా, గూగుల్‌ మ్యాప్‌లు, స్ట్రీట్‌ వ్యూ, కార్‌డ్యాష్‌బోర్డ్‌ కెమెరాలు, టెలిఫోన్‌ డైరెక్టరీలు, ప్రముఖుల ప్రసంగాల్లో చెప్పే కీలక విషయాల వంటివి ఆధారాలు. ఇలాంటి వాటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించి కీలక అంశాలను గుర్తిస్తారు. గతంలో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ అణ్వాయుధాల వద్ద దిగిన ఫొటో ఆధారంగా వాటి సామర్థ్యాన్ని అమెరికా అంచనా వేసింది.

ఆయా దేశాల్లో కీలక ప్రదేశాల గూగుల్‌ మ్యాప్స్‌ను తరచూ సేకరించి వాటిల్లో వస్తున్న మార్పులను గుర్తించి అక్కడ జరిగే కార్యకలపాలను అంచనా వేస్తారు. దీంతోపాటు నిఘా ఉపగ్రహాలు ఉండనే ఉన్నాయి. సైనిక బలగాలకు సంబంధించిన టెండర్‌ ప్రకటలను విశ్లేషించి ఆయా కమాండ్స్‌ వాడే ఆయుధాలు.. ఇతర పరికరాలు.. అవి ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తారు.

తస్మాత్‌ జాగ్రత్త..!

మనదేశంలోని ప్రముఖులు, కీలక శాఖల్లోని ఉద్యోగులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలను, చిత్రాలను విశ్లేషించి కీలక సమాచారం సేకరిస్తారు. అదే సమయంలో దళాల్లో పనిచేసే వారు ఆటవిడుపుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేసే అంశాలు కూడా వారి స్థావర వివరాలను బట్టబయలు చేస్తాయి. బ్రహ్మోస్‌ వివరాలు లీక్‌ అయ్యాక డీఆర్‌డీవో తమ కార్యాలయాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది. నౌకాదళం కూడా గతేడాది చివర్లో తన కీలక స్థావరాల్లో, నౌకల్లో స్మార్ట్‌ ఫోన్ల వినియోగాన్ని బ్యాన్‌ చేసింది.

విదేశాల్లో ఇలా..

గూఢచారులను శత్రుదేశాల్లోకి పంపడం.. వారు చిక్కడం.. ఇరు దేశాల మధ్య వివాదాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ను నమ్మకమైన ఆయుధంగా చాలా దేశాలు ఎంచుకుంటాయి. అగ్రరాజ్యాలు దీనిపై భారీ ఎత్తున వెచ్చిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికా, ఇజ్రాయిల్‌ వంటి దేశాలు భారీ లైబ్రరీలను నిర్వహిస్తున్నాయి. అందుకే సైనిక స్థావరాల వద్ద ఫొటోలపై నిషేధం ఉంటుంది.

ఇదీ చదవండి

అగ్ని రహస్యం బయటకు వచ్చింది!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని